సంక్రాంతి, దసరా, దిపావళి లాంటి పండుగలకు తెలుగు లోగిళ్లలో సంబరాలే కాక.. తెలుగు వెండితెరపై స్టార్ హిరోల సినిమాల వార్ తో తెలుగు నేలపై హంగామా మామూలుగా వుండదు. అయితే.. స్టార్ హీరోలకు సవాల్ విసురుతూ ఇటీవల కాలంలో సక్సెస్ మీద సక్సెస్ సాధిస్తున్నాడు శర్వానంద్. పండగ బరిలో ఘనవిజయాలు సాధించిన రికార్డ్ సాధించిన శర్వానంద్.. అదే ధైర్యంతో మరోసారి జై లవ కుశ,  స్పైడర్ లాంటి బడా హీరోల సినిమాలు పోటి పడుతున్న దసరా సీజన్ లో మహానుభావుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మహానుభావుడు శర్వానంద్ ట్రాక్ రికార్డ్ ను కాపాడిందా..? మారుతి ఖాతాలో మరో సక్సెస్ చేరిందా..?

 

కథ :
ఆనంద్ (శర్వానంద్) ఓసీడీ ( అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) అనే వ్యాధితో ఇబ్బంది పడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతి శుభ్రత, అతి నీట్నెస్ ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి కారణంగా తాను ఇబ్బంది పడటంతో పాటు ఇతరులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. ఆనంద్ తల్లి, కజిన్ (వెన్నెల కిశోర్) లు ఇంకెవరు ఆనంద్ ప్రవర్తనను భరించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆనంద్, మేఘన (మెహరీన్) తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.

తన వ్యాధి గురించి చెప్పకుండా తనను ఇంప్రెస్ చేసి ప్రేమలో పడేస్తాడు. అయితే మేఘన మాత్రం తన తండ్రి రామరాజు (నాజర్)కి నచ్చితేనే నిన్ను ప్రేమిస్తానని ఆనంద్ కు కండిషన్స్ పెడుతుంది. పల్లెటూరి నుంచి వచ్చిన మేఘన తండ్రితో ఆనంద్ ఫ్రీగా ఉండలేకపోతాడు. రామరాజు కూడా తన కూతురికి ఆనంద్ కరెక్ట్ కాదని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆనంద్ రామరాజు కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడు...? మేఘన ప్రేమను ఎలా గెలుచుకోగలిగాడు..? ఆనంద్ వ్యాధిని అతడి ప్రేమ ఎలా జయించింది..? అన్నదే మిగతా కథ.

 

నటీనటులు :
ఓసీడీ అనే ఇబ్బందికర వ్యాధితో బాధపడే పాత్రలో శర్వానంద్ మంచి నటన కనబరిచాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహరీన్ రీ ఎంట్రీలో ఆకట్టుకుంది. గ్లామర్ షోతో పాటు నటిగానూ మంచి మార్కులు సాధించింది. వెన్నెలకిశోర్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. సినిమా అంతా హీరో వెంటే ఉండే పాత్రలో నవ్వులు పూయించాడు. హీరోయిన్ తండ్రిగా నాజర్ హుందాగా కనిపించారు. కూతురి ప్రేమను గెలిపించేందుకు తపన పడే తండ్రిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటం, ఆ పాత్రలో నటించిన నటీనటులు పెద్దగా గుర్తింపు ఉన్నవారు కాకపొవటంతో పెద్దగా మాట్లాడుకోవాల్సిందేమీ లేదు.

 

సాంకేతిక నిపుణులు :
భలే భలే మొగాడివోయ్ సినిమాతో ట్రాక్ మార్చి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మారుతి, ఈ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. హీరో కు ఓ వ్యాధి, ఓ ప్రేమకథ, ఓ సమస్య ఇలా దాదాపు భలే భలే మొగాడివోయ్ కాన్సెప్ట్ తోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే శర్వానంద్ ను ఓసీడీతో ఇబ్బంది పడే వ్యక్తిగా చూపించిన దర్శకుడు కావాల్సినంత వినోదం పంచాడు. కొన్ని సందర్భాంలో అతిగా అనిపించినా.. మంచి కామెడీతో అలరించాడు. కథాపరంగా కొత్తదనం లేకపోయినా.. టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. తమన్ అందించిన సంగీతం పరవాలేదు. సినిమా రిలీజ్ కు ముందే సూపర్ హిట్ అయిన మహానుభావుడవేరా సాంగ్ విజువల్ గా మరింతగా అలరిస్తుంది. నిజర్ షఫీ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్, ప్రతీ సన్నీవేశం, రిచ్ గా కలర్ ఫుల్ గా కంటికింపుగా కనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్ :
శర్వానంద్ నటనే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. కథకు తగ్గ విధంగా ఓసీడీ డిజార్జర్ వున్న వ్యక్తి ప్రవర్తన ఎలావుంటుందో చూపిస్తూ శర్వానంద్ నవ్వులు పూయించాడు. ఈ తరహా కథలతో మెప్పించడం మారుతికే చెల్లింది. కొత్త తరహా కథతో కామెడీని పండించడంలో మారుతి సక్సెస్ అయ్యాడు. ఇక సంగీతం కూడా ఆకట్టుకుంది. మరోవైపు మెహరీన్ తన గ్లామర్ తో ఆకర్షించింది.

 

మైనస్ పాయింట్స్ :

కథ వెరైటీదే అయినా కథనంలో మరింతగా పట్టు లేకపోవటం, ప్రేక్షకుడు తర్వాత ఏం జరుగుతుంది అని ఊహించిన విధంగానే కథ నడవటం కాస్త మైనస్.

 

చివరగా:

కామెడీ మెచ్చే వారికి నచ్చే మహానుభావుడు ఫ్యామిలీ అందరికీ కలిపి పండగకు వినోదం పంచుతాడు.