ఇండియన్ చిత్రాలకు భారీ తనం అంటే ఏంటో చూపించిన దర్శకులలో ముందుగా శంకర్ గురించే చెప్పుకోవాలి. రాజమౌళి బాహుబలితో బిజినెస్ లెక్కలన్నీ వేసుకుని పక్కాగా సక్సెస్ సాధించాడు. కానీ శంకర్ మాత్రం అంతకంటే ముందే రోబో లాంటి భారీ చిత్రాన్ని సినీ అభిమానులకు చూపించాడు. శంకర్ సినిమాల్లో కంటెంటే ప్రధాన బలంగా ఉంటుంది. ఆపై తన దర్శకత్వంలో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాడు. 

సందేశాత్మక కథలని కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా వినోదాత్మకంగా తెరకెక్కించడం శంకర్ కే చెల్లింది. కానీ ఇటీవల శంకర్ రేసులో కాస్త వెనుకబడ్డారు. రోబో చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన 2.0 చిత్రం గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ ఈ చిత్రాన్ని 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు. 

ప్రేక్షకులకు హాలీవుడ్ సినిమాల తరహా అనుభూతిని అందించే ప్రయత్నం చేశారు. కానీ 2.0 ఆశించిన స్థాయిలో విజయంసాధించలేదు. కనీసం జాతీయ అవార్డుల్లో అయినా ఈ చిత్రానికి ఊరట లభిస్తుందని అనుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ లో 2.0 చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కానీ నేషనల్ అవార్డు జ్యూరీ సభ్యులు 2.0 చిత్రానికి మొండి చెయ్యి చూపించారు. 

2.0 విషయంలో జ్యూరీ సభ్యులని నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంత బడ్జెట్ పెట్టామనేది ముఖ్యం కాదు. సినిమా ఎఫెక్టివ్ గా ఉందా లేదా అనేదే ముఖ్యం. ఆ నేపథ్యంలో విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో కెజిఎఫ్ చిత్రం అవార్డుని ఎగరేసుకుపోయింది.