తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. షాహిద్ కపూర్ హీరోగా హిందీలో ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు. సినీ విమర్శకుల నుంచి ఈ చిత్రాన్ని నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటికే కబీర్ సింగ్ చిత్రం 100 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది. 

కబీర్ సింగ్ చిత్రంపై క్రమంగా విమర్శలు ఎక్కువవుతున్నాయి. తెలుగు వర్షన్ కంటే ఘాటుగా సందీప్ వంగా కబీర్ సింగ్ చిత్రాన్ని రూపొందించారు. తెలుగు వర్షన్ కు కూడా విమర్శలు వచ్చాయి. కానీ హిందీలో ఘాటుతనం ఎక్కువ కావడంతో విమర్శకుల ప్రశ్నలకు సమాధానం లేకుండా పోతోంది. డబ్బొస్తే సినిమా హిట్ అయినట్లేనా.. విలువల్ని తుంగలో తొక్కే ఇలాంటి చిత్రాలు నైతికంగా పరాజయం చెందినట్లే అని విమర్శిస్తున్నారు. 

ఇదిలా ఉందా షాహిద్ కపూర్ తల్లి మాత్రం తన కొడుకుని సమర్థిస్తోంది. అసలు షాహిద్ కపూర్ ఈ చిత్రానికి ఎలా అంగీకరించాడు. ఈ సినిమా చేసే ముందు షాహిద్ తన తల్లికి ఓ మాట చెప్పి ఉండాల్సింది. ఆమె ఖచ్చితంగా ఇలాంటి సినిమా చేయొద్దు అని చెప్పేవారు అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విమర్శలపై షాహిద్ కపూర్ తల్లి నీలిమ అజీమ్ స్పందించారు. 

నా కొడుకు ఓ సినిమాలో నటించే ముందు.. అది ఎలాంటి పాత్ర అయినా సరే నేను అడ్డు చెప్పను. ఓ నటుడు తాను ఆ పాత్రలో సరిపోతానా లేదా, చేయగలనా లేదా అని మాత్రమే చూసుకుంటాడు. సమాజం ఏమనుకుంటుందో అని ఏ నటుడు ఆలోచించడు. అలాంటప్పుడు నా కొడుక్కి నేను ఎలా అడ్డు చెబుతాను అని నీలిమ అజీమ్ ప్రశ్నిస్తున్నారు. 

హాలీవుడ్ లో ఇలాంటి చిత్రాలకు ఆస్కార్ అవార్డులు వస్తున్నాయి. కబీర్ సింగ్ తర్వాత మరో సైకో కిల్లర్ మూవీ వస్తుంది. ఆ సినిమా చూసిన వారంతా కిల్లర్స్, సైకోలు అయిపోతారా అని నీలిమ అజీమ్ తన కొడుకుని వెనకేసుకొస్తున్నారు.