బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నవంబర్ 2న తన 53వ పుట్టినరోజు జరుపుకున్నారు. అదే రోజు ఆయన నటించిన 'జీరో' సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. దీంతో షారుఖ్ ఖాన్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇండస్ట్రీ సభ్యుల కోసం ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఓ నైట్ క్లబ్ లో పార్టీ ఏర్పాటు చేశాడు.

అయితే ఈ పార్టీ జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడకి చేరుకొని అక్కడ నుండి అందరినీ పంపేసినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటల వరకు పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ప్లే చేస్తుండడంతో పోలీసులు ఈ విషయంలో కలుగజేసుకోక తప్పలేదు.

ఆ నైట్ క్లబ్ కి అర్ధరాత్రి 1 వరకే ఓపెన్ చేసి ఉంచే పర్మిషన్స్ ఉండగా.. షారుఖ్ ఖాన్ పార్టీ కావడంతో నిర్వాహకులు కూడా ఏం మాట్లాడకుండా పార్టీని కొనసాగించారు. అయితే ఎంతసేపటికీ మ్యూజిక్ ఆపకపోవడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని క్లబ్ లోకి వెళ్లి మ్యూజిక్ సిస్టమ్స్ ఆపేశారు. పోలీసులు అక్కడకి చేరుకోగానే చాలా మంది సెలబ్రిటీలు అక్కడ నుండి వెళ్లిపోయారు.

షారుఖ్ ఖాన్ కూడా పార్టీ నుండి బయటకి వస్తోన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. షారుఖ్ తో పాటు ఈ పార్టీలో స్వరా భాస్కర్. బాస్కో సీజర్, ఆనంద్ ఎల్ రాయ్ వాటి వారు పాల్గొన్నారు.