సినిమాలకు రివ్యూలు, రేటింగ్స్ ఇచ్చే క్రిటిక్స్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మండిపడ్డారు. ఆయన నటించిన 'జీరో' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆ సమయంలో సినిమా గురించి దారుణమైన రివ్యూలు వచ్చాయి.

షారుఖ్ ని కూడా తక్కువ చేసి కామెంట్స్ చేశారు. 'జీరో' సినిమాకి దాదాపుగా అందరూ 2 స్టార్లు రేటింగ్స్ ఇచ్చారు. దీని గురించి ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఫిలిం ఛాయిస్ అవార్డ్స్ కార్యక్రమంలో షారుఖ్ మాట్లాడారు.

తనలాంటి నటులు ఫిలిమ్ మేకర్స్ విభిన్న ఆలోచనలకు మాత్రమే ప్రాముఖ్యతనిస్తారని, ప్రతిభ కోసం ఆరాట పడుతుంటామని.. ప్రేక్షకులకు చెప్పాలనుకునే కథలో నిజాయితీ ఉండేలా చూసుకుంటామని అన్నారు. కాబట్టి సినీ విశ్లేషకులు, విమర్శకులు నా సలహా ఒక్కటే అంటూ.. స్టార్ సిస్టమ్స్ కి అలవాటు పడకండని అన్నారు.

మీరు ఇచ్చే స్టార్ రేటింగ్స్ ను బట్టి మా స్టార్ డం ఆధారపడి ఉండదని క్రిటిక్స్ కి చురకలు అంటించారు. ఒక సినిమాకు 3 స్టార్స్, 3.5 స్టార్స్ అంటూ ఇచ్చుకుంటూ పోవడానికి ఇది హోటల్ కాదు.. దయచేసి ఇలాంటి రేటింగ్ ఇచ్చి స్టార్ డం కోల్పోయామని చెప్పకండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.