దివంగత శ్రీదేవి.. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'జీరో' సినిమాలో అతిథి పాత్ర పోషించారట. ఆమె నటించిన చివరి సినిమా ఇదేనని అంటున్నాడు హీరో షారుఖ్ ఖాన్. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో ప్రమోషన్స్ ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో షారుఖ్ సినిమాలో శ్రీదేవి పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై కొన్ని కామెంట్స్ చేస్తూ ఆమెని  గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో శ్రీదేవి అతిథి పాత్రలో నటించిన మాట వాస్తవమే.. కానీ ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. ఇందులో ఆమె ప్రత్యేక గీతంలో నటించారని కూడా చెప్పలేను.

ఆ పాత్ర ఎలా ఉంటుందో సినిమా చూసిన తరువాత మీకే తెలుస్తుంది. శ్రీదేవి నా సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కోల్పోయిన వాటి విలువేంటో మనకు బాగా తెలుసు. ఆమె ఎక్కడున్నా ప్రపంచాన్ని సంతోషపరుస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. 1996 లో 'ఆర్మీ' అనే సినిమాలో శ్రీదేవితో కలిసి నటించాను.

ఆమె ఇంత త్వరగా వెళ్లిపోతారని అనుకోలేదు. ఆమె ఇప్పుడు మనతో పాటే ఉండుంటే ముందుగా ఈ సినిమా ఆమెకే చూపించేవాడిని'' అంటూ ఎమోషనల్ అయ్యారు. కత్రినా కైఫ్, అనుష్క శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిసంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.