బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన ఓటీటీ ప్లాట్ ఫాం టైటిల్ ను కూడా ప్రకటించారు. దీంతో బాలీవుడ్ పెద్దలు షారుఖ్ ఖాన్ కు శుభాకాంక్షలు తెలపడంతో పాటు, పలు కామెంట్లు చేశారు.
ఏ భాష సినిమానైనా, ప్రస్తుతం థియేటర్ల కంటే ఓటీటీలోనే (OTT) ఎక్కువ మంది ఆడియెన్స్ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్, డిస్నీ ప్లస్ వంటి పెద్ద ఓటీటీ వేదికలు ఉన్నాయి. భారీ బడ్జెట్ మూవీలు, స్టార్ హీరోల సినిమాలను దక్కించుకుంటూ తమ హవా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో కింగ్ ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరో ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన ఓటీటీకి సంబంధించిన టైటిల్ ‘ఎస్ ఆర్ కే ప్లస్’ (SRK+) ను ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక పోస్టర్ షేర్ చేశాడు షారుఖ్ ఖాన్. ‘ఓటీటీ ప్రపంచంలో ఏదో జరగబోతోంది’ అంటూ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చాడు. త్వరలో ‘ఎస్ఆర్ కే ప్లస్’ ఓటీటీకి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు. దీంతో SRK ఆధిపత్యం ఇప్పుడు స్ట్రీమింగ్‌కు కూడా విస్తరిస్తుండటంతో అభిమానులు థ్రిల్ అవుతున్నారు. "కింగ్ ఖాన్ అబ్ OTT పే రాజ్ కరేగా’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ వదులుతున్నారు.
అయితే షారుఖ్ ఖాన్ పోస్ట్ కు బాలీవుడ్ రొమాంటిక్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) స్పందించారు. ‘ఈ రోజు పార్టీ మీపైనే ఉంది.. మీ కొత్త OTT SRK+కి అభినందనలు’ అంటూ పేర్కొన్నారు. అలాగే చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ SRK+కు సహకరిస్తున్నట్టు ఒక ట్వీట్‌లో వెల్లడించారు - ‘డ్రీమ్ కమ్ ట్రూ! తన కొత్త OTT యాప్, SRK+లో షారుఖ్ ఖాన్ తో కలిసి పని చేస్తున్నాను’ అని అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశారు. అదేవిధంగా దర్శకుడు కరణ్ జోహార్ కూడా ట్వీట్ చేశారు. ‘ఈ సంవత్సరపు అతిపెద్ద వార్త.. ఇది OTT రూపురేఖలను మార్చబోతోంది. చాలా ఉత్సాహంగా ఉంది’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
షారూఖ్ ఖాన్ స్వయంగా విధించుకున్న సోషల్ మీడియా విరామం గత సంవత్సరం అతని కుమారుడు ఆర్యన్ మాదక ద్రవ్యాల దోపిడీలో అరెస్టయిన తర్వాత ప్రారంభమైంది. ఒక నెల తర్వాత ఆర్యన్ బెయిల్‌పై విడుదలయ్యాడు. SRK ఇటీవలే ప్రజా జీవితంలోకి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘పఠాన్’(Pathan) మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏఢాది జనవరి 25న రిలీజ్ కానుంది. మూవీలో జాన్ అబ్రహం, దీపికా పదుకునే నటిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం టీజర్ రిలీజై ఆకట్టుకుంటోంది.
