బాహుబలి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమైపోయింది. తన స్టామినా పవర్ ఆలస్యమైనకొద్దీ మరింత రెట్టింపవుతుందని ప్రభాస్ నిరూపించాడు. సోషల్ మీడియాలో ఎవరు కలలో కూడా ఊహించని రికార్డును అందుకుంది సాహో మేకింగ్ వీడియో 'షేడ్స్ ఆఫ్ సాహో'. 

రీసెంట్ గా ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా షేడ్స్ ఆఫ్ సాహో ని రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో మొత్తంగా 52మిలియన్ల వ్యూస్ అందుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక యూ ట్యూబ్ లో విడుదలైన 24గంటల్లోనే 10మిలియన్ వ్యూస్ ని దాటేసింది. అదే విధంగా 400k లైక్స్ అందుకున్న మొదటి మేకింగ్ వీడియోగా నిలిచింది. 

హాలీవుడ్ రేంజ్ లో ప్రభాస్ సినిమాలో సీన్స్ దర్శనమిస్తుండడంతో అభిమానులకు బాగా నచ్చేసింది. బాహుబలి సినిమా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చింది కాబట్టి ప్రభాస్ కి అంత రేంజ్ లో క్రేజ్ వచ్చిందని, నెక్స్ట్ సినిమాకు అంత క్రేజ్ ఉండదని విమర్శలు చేసిన వారికి జస్ట్ మేకింగ్ వీడియో ద్వారా కౌంటర్ పడింది. నార్త్ జనాలు కూడా ప్రభాస్ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారని క్లారిటీ వచ్చేసింది.. 

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ రిచ్ గా నిర్మిస్తోంది. ఇక శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా  2019సమ్మర్ లో విడుదల కానుంది.