వెండితెరపై నవ్వులు పండించిన నటి శ్రీలక్ష్మి జీవితం విషాదాలమయం. తాజాగా ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.  

నాలుగు దశాబ్దాల ప్రస్థానం కలిగిన నటి శ్రీలక్ష్మి 500 లకు పైగా చిత్రాల్లో నటించారు. కమెడియన్ గా స్టార్డమ్ అనుభవించిన వన్ అండ్ ఓన్లీ లేడీ. అయితే శ్రీలక్ష్మి జీవితంలో అన్నీ విషాదాలే. నవ్వించే వెండితెర జీవితం వెనుక కన్నీరు పెట్టించే సంఘటనలు ఉన్నాయి. తాజా ఇంటర్వ్యూలో శ్రీలక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

శ్రీలక్ష్మి మాట్లాడుతూ... మా నాన్న అమర్నాథ్ పెద్ద హీరో. ఆయనకు మేము ఎనిమిది మంది సంతానం. జాండిస్ రావడంతో నాన్న యాక్టింగ్ మానేశారు. దాంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. నేను నటించాల్సిన పరిస్థితి వచ్చింది. నాన్నకు మాత్రం అది ఇష్టం లేదు. ఆడపిల్ల పరిశ్రమకు వెళ్లి కష్టపడటం అవసరమా? అనేవారు. మన పరిస్థితి బాగోలేదు కద నాన్నా.. అంటే నా వల్లే మీకు బాధలు అంటూ వేదన పడేవారు. 

అమ్మ మాత్రం నువ్వు నటిస్తేనే మనకు తిండి. లేదంటే అందరం విషం తాగి చచ్చిపోదాం అంది. అలా తప్పని పరిస్థితుల మధ్య నా నట ప్రస్థానం మొదలైంది. 41 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నాను. నా తమ్ముడు రాజేష్ హీరో అయ్యాడు. ఆరోజుల్లోనే లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఎంత త్వరగా పైకి వచ్చాడో అంతే త్వరగా కన్నుమూశాడు. నాకు శుభోదయం మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. అదే సమయంలో నాన్న చనిపోయారు. దాంతో ఆ ఆఫర్ చేజారింది. 

ఎనిమిది మంది సంతానంలో మిగిలింది ముగ్గురమే. నాకు పెళ్లి అయింది. భర్త ఉన్నారు. ఆయన గురించి ఎవరికీ చెప్పను. ఆయన గురించి ఇతరులకు తెలియడం నా భర్తకు ఇష్టం లేదు. నేను చెన్నైలో స్థిరపడ్డాను. ప్రొఫెషనల్ గా హైదరాబాద్ లో ఉంటున్నాను.. అని లక్ష్మి చెప్పుకొచ్చారు. శ్రీలక్ష్మి తమ్ముడు రాజేష్ అకాల మరణం చెందాడు. ఆయన కూతురు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.