ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి 2898 ఏడీ` చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అదే సమయంలో ఈ మూవీలో భారీ కాస్టింగ్‌ ఉందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ క్రేజీ అప్‌ డేట్‌ వచ్చింది.  

ప్రభాస్‌ పాన్‌ ఇండియా దాటి గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ `కల్కి 2898 ఏడీ` చిత్రంతో వస్తున్నారు. `మహానటి` ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. వైజయంతి మూవీస్‌ నిర్మించారు. సుమారు ఆరువందల కోట్లకుపైగా బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారట. అయితే ఇందులో ప్రభాస్, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీతోపాటు కమల్‌ హాసన్‌ పాత్రలనే రివీల్‌ చేశారు టీమ్‌. మిగిలిన పాత్రల గురించి చెప్పలేదు. 

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఇందులో భారీ కాస్టింగ్‌ ఉందని తెలుస్తుంది. చాలా మంది స్టార్స్ మెరుస్తారని సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో క్రేజీ విషయాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో స్టార్‌ కాస్టింగ్‌ చాలా పెద్దదిగానే ఉండబోతుందట. ముందుగా వినిపించినట్టుగానే విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ గెస్ట్ లుగా నటిస్తున్నారు. వీరితోపాటు మృణాల్‌ ఠాకూర్‌, రానాలు కూడా కనిపిస్తారని అన్నారు. నాని కూడా ఉంటారట. కీర్తిసురేజ్‌ బుజ్జి పాత్రకి వాయిస్‌ అందిస్తుంది.

వీరే కాదు మరింత మంది ఉన్నారట. ఇందులో ఆసక్తికర పేర్లు తెరపైకి రావడం విశేషం. రాజమౌళి కూడా కనిపిస్తారట. అంతేకాదు రామ్‌గోపాల్‌ వర్మ కూడా కీలక పాత్రలో గెస్ట్ గా మెరుస్తారట. అలాగే హాస్య బ్రహ్మా బ్రహ్మానందం కూడా ఉంటారని ఇటీవల యానిమేషన్‌ వీడియో ద్వారా తెలిసింది. వీరితోపాటు మరో సీనియర్‌ నటి పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అలనాటి నటి శోభన కూడా ఇందులో కనిపించబోతుందట. కీలక పాత్రలో ఆమె కనిపిస్తుందని సమాచారం. శోభన సినిమాలు చేయడమే తగ్గించారు. తెలుగులో కనిపించి చాలా ఏళ్లు అవుతుంది. 1997 తర్వాత ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు. ఈ క్రమంలో ఇప్పుడు `కల్కి`లో ఆమె రీఎంట్రీ ఇస్తుందట. సుమారు 27 తర్వాత ఆమె తెలుగులో మెరవబోతుందని చెప్పొచ్చు.

ఇలా భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న సినిమా కావడంతో `కల్కి 2898ఏడీ`పై భారీ అంచనాలున్నాయి. నాగ్‌ అశ్విన్‌ డిజప్పాయింట్‌ చేయడనే నమ్మకం ఉంది. కానీ ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్‌ పరంగా ఎలాంటి బజ్‌ క్రియేట్‌ కాలేదు. ఆహో, హోమో అనే హడావుడి తప్పితే కంటెంట్ ఆకట్టుకోలేకపోయింది. సైన్స్ ఫిక్షన్‌ స్టోరీ కావడం, మైథలాజికల్‌ అంశాలకు ముడిపెట్టి ఈ చిత్రాన్ని తీయడం అనేది పెద్ద ప్రయోగం. అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుంది, ఆడియెన్స్ ని ఎంత వరకు ఆకట్టుకుంటుందనేది పెద్ద సస్పెన్స్. మరి ఎలా ఉంటుందో చూడాలి. 

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచింది టీమ్‌. త్వరలోనే ట్రైలర్‌ని విడుదల చేయబోతుంది. ఎన్నికల ఫలితాల అనంతరం రెండో వారంలో ట్రైలర్‌ని విడుదల చేసే అవకాశం ఉందట. విజువల్‌ వండర్‌లా ఈ ట్రైలర్‌ ఉంటుందని, అసలు కంటెంట్‌ని ఇందులో చూపిస్తారని సమాచారం. మరి అది ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక సినిమాని ఈ నెల 27న విడుదల చేయబోతుంది టీమ్‌.