కరోనతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. వరుస సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యుల మరణాలు ఇండస్ట్రీ వర్గాలలో కలవరం కలిగిస్తున్నాయి. గత మూడు నెలల కాలంలో సౌత్‌ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలోనూ విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా బహు భాష నటిగా పేరు తెచ్చుకున్న సీనియర్‌ నటి శరణ్య ఇంట విషాదం నెలకొంది.

తల్లి పాత్రలో ఎంతో పాపులర్ అయిన నటి శరణ్య తండ్రి, ఆంటోని భాస్కర్‌ రాజ్‌ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. చెన్నైలోని విరుగంబక్కమ్‌ ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి 8 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆంటోని మలయాళ ఇండస్ట్రీలో దర్శకుడిగా పలు చిత్రాలను రూపొందించారు.

శ్రీలంకలో తొలిసారిగా మెగా ఫోన్‌ పట్టుకున్న ఆంటోని స్టార్ తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో 70కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. ఆయన మృతితో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆంటోని భాస్కర్‌ రాజ్‌ మృతికి సంతాపం తెలియజేశారు.