అక్కినేని అఖిల్ తన తొలి హిట్ కోసం ఆరాటపడుతున్నాడు. మూడు చిత్రాలుగా విజయం అఖిల్ కు దూరం జరుగుతూనే ఉంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు వరుసగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అఖిల్ నాల్గవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో తెరక్కుతోంది. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ నటీనటుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ తల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఆ పాత్రకు సీనియర్ నటి ఆమనిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే 24 ఏళ్ల క్రితమే అఖిల్ కు ఆమని తల్లిగా నటించారు. 1995లో రిలీజైన సిసింద్రీ చిత్రంలో అఖిల్ పసిబాలుడిగా కనిపించాడు. ఈ చిత్రంలో అఖిల్ కు తల్లిదండ్రులుగా ఆమని, శరత్ బాబు నటించారు. అఖిల్ నాల్గవ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించనున్నాడు. అఖిల్ ఈ చిత్రం కోసం సరికొత్త గెటప్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.