కరోనా కారణంగా నాలుగు నెలలుగా సినిమా రిలీజ్‌లు ఆగిపోయాయి. దీంతో స్టార్ హీరోలు, బడా సినిమాలు  థియేటర్లు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తుంటే, చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం ఓటీటీల ద్వారా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలో తొలి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య.

నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు భారీగా వ్యూస్‌ వస్తున్నాయి. వరుసగా విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న సత్యదేవ్‌ హీరోగా నటించటం, కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్‌ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా డిజిటల్‌ లో భారీగా వ్యూస్‌ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌కు మంచి ధర పలికాయి. సాధారణంగా కమర్షియల్ సినిమాల శాటిలైట్‌ రైట్స్ విషయంలో జెమినీ టీవీ, మా టీవీ, జీ తెలుగు మాత్రమే పోటి పడుతుంటాయి. కానీ అనూహ్యంగా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాను ఈటీవీ మంచి ధరకు సొంతం చేసుకుంది. ఈ సినిమా శాటిలైట్‌ దాదాపు 2.5 కోట్లు పలికినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఈటీవీలో ప్రసారం కానుంది.

మలయాళంలో ఘనవిజయం సాధించిన మహేశింతే ప్రతీకారమ్‌ ఈ సినిమాను తెలుగులో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్‌, మహాయణ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరిు ఈ సినిమాను నిర్మించారు. సత్యదేవ్‌ హీరోగా నటించగా సీనియర్‌ నరేష్, సుహాస్‌, జబర్థస్త్‌ రామ్‌ ప్రసాద్‌, కరుణాకరన్‌, రవీంద్ర విజయలు కీలక పాత్రల్లో నటించారు.