రియల్‌ స్టార్‌ శ్రీహరి టాలీవుడ్‌లో నటుడిగా ఎంతటి పేరును తెచ్చుకున్నారో తెలిసిందే. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విలక్షణ నటనతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. వ్యక్తిగతంగానూ అందరి మన్ననలు పొందారు. ఆయన అకాల మరణం.. టాలీవుడ్‌లో ఆయన లేని లోటు ఇప్పటికీ అలానే ఉండిపోయింది. 

ఇక ఆయన తనయుడు మేఘామ్ష్ శ్రీహరి తెరంగేట్రంతో ఆయనపై ఆశలు రేకెత్తాయి. గతేడాది `రాజ్‌దూత్‌`తో హీరోగా ఎంట్రి ఆకట్టుకున్నారు. కానీ సినిమా పరాజయం చెందింది. తాజాగా మరో సినిమాకి కమిట్‌ అయ్యాడు. `శతమానం భవతి` వంటి జాతీయ అవార్డు చిత్రాన్ని రూపొందించిన సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఇందులో దర్శకుడు సతీష్‌ వేగేశ్న తనయుడు సమీర్‌ వేగేశ్న కూడా మరో హీరోగా నటిస్తుండటం విశేషం. 

నేడు శ్రీహరి జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కొత్త సినిమాను ప్రకటించారు. ఇక ఈ సినిమాని `రాజ్‌దూత్‌` చిత్రాన్ని నిర్మించిన ఎంఎల్‌వీ సత్యానారాయణ(సత్తిబాబు) తన లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్‌ వేగేశ్న మాట్లాడుతూ, ఇప్పటి వరకు వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేశాను. ఓ మంచి పూర్తి స్థాయి వినోదభరితమైన సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. అన్ని కుదిరితే త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్ చేస్తాం` అని తెలిపారు. 

నిర్మాత ఎంఎల్‌వీ సత్యానారాయణ స్పందిస్తూ, `సతీష్‌ తీసిన `శతమానం భవతి` చిత్రం నా మనసుకి బాగా నచ్చింది. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం` అని అన్నారు.