సంతోష్‌ శోభన్‌  పెళ్లి కష్టాలతో వచ్చాడు. పీఠల మీదే పెళ్లి ఆగిపోతే ఏం జరిగింది, ఆ వరుడి పరిస్థితేంటి? అనే కథాంశంతో రూపొందుతున్న `ప్రేమ్‌ కుమార్‌` చిత్రంలో నటించారు.

కాన్సెప్ట్ ప్రధానంగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు సంతోష్‌ శోభన్‌. తక్కువ బడ్జెట్‌లో కాన్సెప్ట్ నేపథ్యంలో చిత్రాలతో అలరిస్తున్న ఆయన తాజాగా పెళ్లి కష్టాలతో వచ్చాడు. పీఠల మీదే పెళ్లి ఆగిపోతే ఏం జరిగింది, ఆ వరుడి పరిస్థితేంటి? అనే కథాంశంతో రూపొందుతున్న `ప్రేమ్‌ కుమార్‌` చిత్రంలో నటించారు. ఇందులో రాశీ సింగ్‌, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించారు. అభిషేక్‌ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ప్రారంభం నుంచి డిఫరెంట్‌గా ప్రమోట్‌ చేస్తూ వస్తున్నారు. సరికొత్త ప్రమోషన్స్ తో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను దర్శకుడు అభిషేక్‌ మహర్షి వెల్లడించారు. `కుచ్‌ కుచ్‌ హోతా హై`, `నువ్వే నువ్వే` వంటి చిత్రాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కథని రాసుకున్నారట. మగాడికి పెళ్లి అయితే జీవితం నాశనం అవుతుందంటారు. మరి పీఠల మీదే పెళ్లి ఆగిపోతే ఎలా ఉంటుందనే ఐడియాతో ఈ స్క్రిప్ట్ రాసుకున్నట్టు చెప్పారు. పీఠల మీద పెళ్లి ఆగిపోతే ఎలా అని ఆలోచించి రాసుకున్నారట. నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఆ విషయాలు తెలుసుకుని ఈ కథని రాసుకున్నట్టు తెలిపారు దర్శకుడు. 

విశ్వక్ సేన్‌ నటించిన `అశోకవనంలో అర్జున కళ్యాణం` చిత్రానికి దీనికి సంబంధం లేదని తెలిపారు. రెండు భిన్నమైనవని చెప్పారు. `సాధారణంగా సినిమాల్లో పెళ్లి సీన్‌లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్‌ పెళ్లి ఆపుతాడు. హీరో హీరోయిన్లు కలిసిపోతారు. కానీ ఆ పెళ్లి కొడుకు గురించి ఎవ్వరూ ఆలోచించరు. వాడికి కూడా ఓ జీవితం ఉంటుంది. అది చెప్పేందుకే ఈ `ప్రేమ్ కుమార్` సినిమాను తీశాం. స్క్రిప్ట్ లాక్ అయ్యాక అందులో ఎవ్వరూ ఏమీ వేలు పెట్టలేదు. సంతోష్ ఒక్కసారి సినిమా ఒప్పుకుంటే, స్క్రిప్ట్ ఓకే చేస్తే.. డైరెక్టర్ ఏం చేయమంటే అదే చేస్తాడు. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిన తరువాత ఎలాంటి మార్పులు చేయలేదు. 

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనంత్ శ్రీక‌ర్ చదువుకునే రోజుల నుంచి నాకు తెలుసు. శ్రీచరణ్ పాకాల దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. కామెడీ జానర్ ఆయనకు కొత్త. ఈ సినిమాకు ఫ్యూజన్ స్టైల్లో మ్యూజిక్ కొట్టాడు. ఆర్ఆర్ కూడా అద్భుతంగా వచ్చింది. థియేటర్లో సౌండింగ్ పరంగా కొత్త ఫీలింగ్ వస్తుంది. `పేపర్ బాయ్` అయిపోయిన టైంలోనే సంతోష్ శోభన్‌ను కలిశాను. ఓ షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకున్నాం. అలా చివరకు సినిమాను చేశాం. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లోంచి ఓ కథను ఎంచుకున్నాం. చివరకు `ప్రేమ్ కుమార్` కథ సెట్ అయింది. నా కామెడీ టైమింగ్‌ను సంతోష్, శివ బాగా నమ్మేవారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ఎక్కడా వల్గారిటీ, బూతులు ఉండవు. అమ్మానాన్నలతో కలిసి ఈ సినిమాను హాయిగా చూడొచ్చు. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది` అని తెలిపారు.