ప్రముఖ బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాదత్ సోదరుడు సంజయ్ దత్ త్వరలోనే రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. సెప్టెంబర్ 25న సంజయ్ దత్ రాష్ట్రీయ సమాజ్ పక్ష్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర మంత్రి మహాదేవ్ జంకర్ వెల్లడించారు. 

బీజేపీ మిత్రపక్షమైన ఆర్.ఎస్.పీ లో సంజయ్ దత్ చేరబోతున్నట్లు శివాజీపార్క్ లో జరిగిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో జంకర్ వెల్లడించారు. సంజయ్ దత్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారని.. ఆయన పార్టీలో చేరతారని దత్ వీడియోను కార్యకర్తల సమావేశంలో ప్రదర్శించారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్.ఎస్.పీ కి సముచిత స్థానాలు కేటాయిస్తామని బీజేపీ మంత్రి పంకజ ముండే ఇటీవల ప్రకటించాడు. సంజయ్ దత్ ఆర్.ఎస్.పీలో చేరితే వచ్చే ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసే ఛాన్స్ ఉందని ముంబై పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ కాంగ్రెస్ లీడర్ గా ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎన్నికయ్యారు. అలానే మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్, స్పోర్ట్స్ కి సంబంధించిన కేటగిరీలలో కూడా ఆయన తన సేవలందించారు. సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి ముంబై రాష్ట్రానికి కొంతకాలం సేవలందించింది.