సినీ రంగాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల వరుసగా బాలీవుడ్‌ సినీ ప్రముఖులు మరణిస్తుండటం ఇండస్ట్రీ వర్గాలను కలచి వేస్తుండగా తాజాగా సౌత్‌ ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరో మృతి చెందాడు. సీనియర్‌ హీరో అర్జున్‌ బంధువు సాండల్‌ వుడ్‌ యంగ్ హీరో చిరంజీవి‌ సర్జ చిన్న వయసులో గుండె పోటుతో మృతి చెందాడు. అతని వయసు కేవలం 39 సంవత్సరాలే.

శనివారం సాయంత్రం ఊపిరి తీసుకోలేకపోతుండటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చిరంజీవిని కాపాడేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో ఆయన ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయనకు కరోనా టెస్ట్ కూడా నిర్వహించినట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు.

చిరంజీవి సర్జ సోదరుడు ధృవ సర్జ కూడా కన్నడ నాట హీరోగా మంచి ఫాంలో ఉన్నాడు. అంతేకాదు చిరంజీవి సర్జ లెజెండరీ నటుడు శక్తి ప్రసాద్‌కు మనవడు కూడా. అర్జున్‌ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన చిరంజీవి దాదాపు 4 సంవత్సరాలు పాటు దర్శకత్వం శాఖలోనే పనిచేశాడు. 2009లో రిలీజ్‌ అయిన వాయుపుత్ర సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు చిరంజీవి.

2018లో నటి మేఘన రాజ్‌ను వివాహం చేసుకున్నాడు చిరంజీవి, ఆమె కన్నడతో పాటు పలు తమిళ చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం మేఘన  రాజ్‌ గర్భవతి.  పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు చిరంజీవి. ఆయన నటించిన చిర్రు, సిన్రగ, అమ్మా ఐ లవ్‌ యూ, ఆటగర సినిమాలు సూపర్‌ హిట్ అయ్యాయి. తాజాగా రాజ మార్తండ సినిమాలో నటించాడు చిరంజీవి సర్జ. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరో మూడు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.