దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదంటారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకొని మరి ఆయన కోసం సినిమా చేయడానికి ఒప్పుకుంటారు. అదే తరహాలో కోలీవుడ్ యాక్టర్ కం డైరెక్టర్ సముద్రఖని కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పాడు. 

రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న బారి మల్లీస్టారర్ ను రాజమౌళి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ సినిమాలో హీరోల గురించి తప్పా ఇంకా ఇతర నటీనటుల గురించి అధికారికంగా ఎలాంటి విషయాన్నీ బయటకు రానివ్వలేదు. కనీసం హీరోయిన్స్ ఎవరన్నది కూడా జక్కన్న హింట్ ఇవ్వలేదు. అయితే ఓ కీలక పాత్రలో నటిస్తోంది మాత్రం సముద్రఖని అని తెలిసిపోయింది. 

రీసెంట్ గా తమిళ మిడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ యాక్టర్ జక్కన్న మల్టీస్టారర్ లో నటిస్తున్నట్లు చెప్పాడు. ఆయన నుంచి అఫర్ వస్తే ఎలా వద్దంటాను అని చెబుతూ నాడోడిగల్ (తెలుగులో శంభో శివ శంభో) సినిమా చూసి అప్పట్లోనే ఆయన నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. ఇక రీసెంట్ గా ఇంటికి పిలిచి కుటుంబాన్ని పరిచయం చేశారు. అప్పుడే RRR సినిమా గురించి చెప్పడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పేసుకున్న అని సముద్రఖని వివరణ ఇచ్చారు.