సంపూర్నేష్ బాబు నటించిన 'కొబ్బరిమట్ట' సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను మదనపల్లెలో విడుదల చేయలేదంటూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని బాబుకాలనీకి చెందిన డి.రామచంద్ర కుమారుడు రెడ్డెప్ప(23) టూవీలర్‌ మెకానిక్‌ గా పని చేస్తున్నాడు. 'కొబ్బరిమట్ట' సినిమా శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా విడుదలైనప్పటికీ మదనపల్లెలో మాత్రం విడుదల కాలేదు.

దీంతో రెడ్డెప్ప తన స్నేహితులతో కలిసి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమా విడుదల చేయాలని దర్శకనిర్మాతలను కోరాడు. వారు స్పందించకపోవడంతో  ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్థానిక అయోధ్యనగర్ లోని ఓ సెల్ టవర్ ఎక్కాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు వెంటనే టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫోన్ చేసి రెడ్డెప్పతో మాట్లాడారు. కిందకి దిగొస్తే న్యాయం చేస్తామని చెప్పినా.. సాయంత్రం ఆరు గంటల వరకు సెల్ టవర్ పైనే ఉండిపోయాడు రెడ్డెప్ప. స్థానికులు పెద్ద సంఖ్యలో  అక్కడకి చేరుకోవడంతో రెడ్డెప్ప మరింత రెచ్చిపోయాడు. మిగిలిన హీరోల సినిమాలైతే విడుదల చేస్తారు.. సంపూర్నేష్ బాబు సినిమాను ఎందుకు విడుదల చేయరంటూ పోలీసులను ప్రశ్నించాడు.

ఆ తరువాత రెడ్డెప్ప చిన్నమ్మ కొడుకు ప్రశాంత్ ని సెల్ టవర్ ఎక్కించి రెడ్డప్పను కిందకు దింపే ప్రయత్నం చేశారు. అరగంట తరువాత అతడు కిందకు దిగొచ్చాడు. అతడు తాగి ఉండడంతో పోలీసులు జీపులో స్టేషన్ కి తరలించారు.