Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: సమ్మోహనం

మీడియం బడ్జెట్ లో స్టార్లు లేకపోయినా.. తన కథలతో సక్సెస్ లు అందుకుంటూ దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ

sammohanam movie telugu review

నటీనటులు: సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నరేష్, పవిత్ర లోకేష్ తదితరులు 

సినిమాటోగ్రఫీ: పి.జి.విందా

సంగీతం: వివేక్ సాగర్ 

నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్ 

దర్శకత్వం: ఇంద్రగంటి మోహన్ కృష్ణ 

మీడియం బడ్జెట్ లో స్టార్లు లేకపోయినా.. తన కథలతో సక్సెస్ లు అందుకుంటూ దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. గతేడాది 'అమీ తుమీ' చిత్రంతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన ఈయన తాజాగా 'సమ్మోహనం' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
విజయ్(సుధీర్ బాబు) ఫైన్ ఆర్ట్స్ చదువు పూర్తి చేసి తన బొమ్మలతో కూడిన పిల్లల పుస్తకాన్ని పబ్లిష్ చేయాలని చూస్తుంటాడు. తల్లితండ్రులు, చెల్లెలితో కలిసి హైదరాబాద్ లోనే జీవిస్తుంటాడు. అయితే తన ఇంటిని సినిమా వాళ్లు 20 రోజుల పాటు షూటింగ్ కి ఇవ్వమని అడుగుతారు. విజయ్ తండ్రి సర్వేష్(నరేష్) దానికి అంగీకరిస్తాడు. షూటింగ్ సమయంలో విజయ్ కు ఆ సినిమా హీరోయిన్ సమీరా(అదితిరావు)తో పరిచయం ఏర్పడుతుంది. సినిమా వాళ్లంటే విజయ్ కు పెద్దగా నచ్చదు. అదంతా ఓ వింత ప్రపంచమని అందులో నిజమనేది ఉండదని అనుకుంటుంటాడు. అటువంటిది తనకు తెలియకుండానే సమీరాను ఇష్టపడతాడు. సమీరాకు కూడా విజయ్ అంటే ఇష్టమే అయినప్పటికీ ఆ విషయాన్ని బయటపడనివ్వదు. షూటింగ్ పూర్తవ్వడంతో సమీరా ఆ ఇంటి నుండి వెళ్లిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ మనాలికి వెళ్తాడు విజయ్. తను సమీరాను ఎంతగా ప్రేమిస్తున్నాడనే  విషయం ఆమెకు చెబుతాడు. కానీ దానికి సమీరా అంగీకరించదు. సమీరా.. విజయ్ ప్రేమను ఎందుకు ఒప్పుకోలేదు..? విజయ్ పై ఇష్టాన్ని దాయడం వెనుక అసలు కారణం ఏంటి..? చివరకు వీరిద్దరూ ఒక్కటవుతారా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
ఓ సాధారణ కుర్రాడు క్రేజ్ ఉన్న ఫిల్మ్ హీరోయిన్ ను ప్రేమిస్తే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. సినిమా వాళ్లంటే జనాల్లో ఒకరకమైన ఒపీనియన్ ఉంటుంది. వాళ్లను నార్మల్ గా చూడలేరు. కానీ వాళ్లకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. అందరిలానే బ్రతకడానికి ఇష్టపడతారు. అనే విషయాలను ఈ సినిమాలో చక్కగా వివరించారు. స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ ఆర్ట్ వర్క్ చేసే ఓ నార్మల్ అబ్బాయిని ప్రేమించడం, అతడి కోసం ఆమె పడే వేదన వంటి విషయాలను తెరపై ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా చూపించారు. ప్రధమార్ధం మొత్తం కూడా ఎంతో పీస్ ఫుల్ గా నడిపించారు. హీరోయిన్.. హీరో ఇంట్లోకి ఎంటర్ అయినప్పటి నుండి సినిమా కథ మొదలవుతుంది. తెలుగు సరిగ్గా రాని ఆమెకు తెలుగు నేర్పించే ఓ ట్యూటర్ గా హీరో ఆమెకు దగ్గరవుతాడు. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ తనకు కనెక్ట్ అయిపోవడంతో ఎంతో ఆనందంగా గడుపుతుంది. ఆమె కూడా 
హీరోని ప్రేమిస్తుంది. వీరిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం.

sammohanam movie telugu review

హీరో క్యారెక్టర్ తనకు ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి కావాలో వివరించే సీన్ ను ఎంతో బాగా పిక్చరైజ్ చేశారు. బహుసా ఏ సినిమాలో కూడా ఇంత అందమైన, సహజమైన ఫ్రేమింగ్ ను చూసి ఉండరు. ఆమె కోసం హీరో మనాలి వెళ్లి లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆ సమయంలో దర్శకుడు రాసుకున్న మాటలు ఫ్రెష్ గా అనిపిస్తాయి. కేవలం లవ్ స్టోరీ మీద ట్రాక్ నడిపించకుండా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఫన్ యాడ్ చేయడం బాగుంది. సినిమా వాళ్ల గురించి చెప్పే డైలాగ్స్ సైతం ఆకట్టుకుంటాయి. ద్వితీయార్ధంలో సినిమా కాస్త గాడి తప్పినట్లు అనిపించినా.. అప్పటికే ఆడియన్స్ కథకు కనెక్ట్ అవ్వడంతో నచ్చేస్తుంది. హీరోయిన్ తన ప్రేమను ఎందుకు వ్యక్తపరచలేకపోతుందనే విషయం మరింత బలంగా ఉంటే బాగుండేది. పతాక సన్నివేశాల్లో జోష్ తగ్గినా.. ఓవరాల్ గా సినిమా మెప్పిస్తుంది. పక్కా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకొని నమ్మకంతో సినిమా చేస్తే ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. ఆ స్క్రిప్ట్ వెనుక ఉన్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ హార్డ్ వర్క్ ను మెచ్చుకోకుండా ఉండలేం.

sammohanam movie telugu review

తన కథ ఎంత సహజంగా ఉందో... నటీనటుల నుండి అంతే సహజమైన నటనను రాబట్టుకోగలిగాడు. సుధీర్ బాబుకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వడం ఖాయం. సున్నితమైన సీన్స్ లో ఎంతో అనుభవం ఉన్న నటుడిలా ఒదిగిపోయాడు. అదితిరావు హైదరిని తెరపై చాలా అందంగా చూపించారు. అంత అందంగా నటించింది కూడా.. తన కళ్లతోనే చక్కటి హావభావాలు పలికించింది. ఆమె కాస్ట్యూమ్స్ బాగున్నాయి. సుధీర్ బాబు, అదితి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది. నిజమైన ప్రేమ ఇంత బాగుంటుందా అనే భావనను ఆడియన్స్ లో క్రియేట్ చేయగలిగారు. సీనియర్ నరేష్ కు హీరో తండ్రిగా మంచి క్యారెక్టర్ పడింది. తన నటనతో వీలైనంతగా నవ్వించాడు. పవిత్ర లోకేష్, తనికెళ్ల భరణి, హరితేజ, రాహుల్ రామకృష్ణ ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కాస్టింగ్ ఎక్కువగా పెట్టేసి ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేయకుండా తక్కువ మంది తారలతో సింపుల్ గా డీల్ చేశాడు దర్శకుడు.

sammohanam movie telugu review
సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. పిజి విందా కెమెరా ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపించింది. సినిమాలో ఈ ఫ్రేమ్ బాలేదని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా కనిపించదు. అంతగా తన వర్క్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. హీరో, హీరోయిన్ క్లోజప్ షాట్స్ తెరపై మంచి ఫీల్ ను కలిగిస్తాయి. ఇంటి టెర్రస్ ను బాగా చూపించారు. వివేక్ సాగర్ సంగీతం సినిమాకు మరో హైలైట్. కథలో భాగంగా పాటలన్నీ ఉంటాయి. కథతో పాటు అవి కూడా రన్ అవుతుంటాయి. ప్రతి పాట వినడానికి, చూడడానికి బాగున్నాయి.నేపధ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్లు ఎంతో సింపుల్ గా ఆకట్టుకునే విధంగా ఉంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంద్రగంటి 'సమ్మోహనం' అనే మరో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ను ఆడియన్స్ కు అందించాడు. బి,సి ఆడియన్స్ కు ఈ సినిమా ఎంతవరకు రీచ్ అవుతుందనే విషయం చెప్పలేని పరిస్థితి. కానీ మల్టిప్లెక్స్ ఆడియన్స్, యూత్ కు మాత్రం ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. 

రేటింగ్: ౩/5

 

              

Follow Us:
Download App:
  • android
  • ios