- Home
- Entertainment
- 400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్, 400 సినిమాల్లో నటించిన రికార్డు, హావభావాలతోనే నవ్వించగల టాలెంట్, తెరపై నవ్వుల పంట పండించినా.. తెర వెనుక మాత్రం ఎన్నో కష్టాలు..చూసిన నటుడు. జీరో నుంచి వందల కోట్లకు అధిపతిగా మారిన స్టార్ ఎవరో తెలుసా?

నవ్వుల రారాజు
బాలీవుడ్ స్టార్ కమెడియన్ల లిస్ట్ లో జగదీప్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. నవ్వుల రారాజు జగదీప్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డు సృష్టించాడు. దాదాపు 400లకు పైగా సినిమాల్లో నటించి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు వినోదం పంచాడు. తెరపై నవ్వులు పంచినా, తెర వెనుక మాత్రం ఎన్నో కష్టాలు, పోరాటాలు ఫేస్ చేశాడు జగదీప్. ముఖం, కళ్లతోనే హావభావాలు చూపించి ప్రేక్షకులను కట్టిపడేసిన జగదీప్ ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలిచాడు.
సూర్మా భోపాలిగా ఫేమస్
జగదీప్ అసలు పేరు సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ. స్క్రీన్‌పై ఎన్నో పేర్లతో కనిపించినప్పటికీ, ఇండస్ట్రీలో అతనిని ఎక్కువగా “జగదీప్”గా, ప్రత్యేకంగా “సూర్మా భోపాలి”గా గుర్తిస్తారు. షోలే సినిమాలో వేసిన వ్యాపారి పాత్తతో అతనికి ఆ పేరు అలా నిలిచిపోయింది. బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ రెండు పేర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన కామెడీ టైమింగ్, భావ వ్యక్తీకరణ ప్రేక్షకుల్లో నవ్వులు పూయించే విధంగా ఉండేవి.
1939లో జన్మించిన జగదీప్ చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. దీంతో కుటుంబ బాధ్యతలు చిన్న వయస్సులోనే తన భుజాలపై పడ్డాయి. చదువుకోవలసిన వయస్సులోనే ఆయన ముంబైకి వలస వెళ్లి చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయనకు అదృష్టం ఎక్కువ కాలం నిరీక్షింపజేయలేదు.
మొదటి రెమ్యునరేషన్ 6 రూపాయలు
బీఆర్ చోప్రా తెరకెక్కించిన ‘అఫ్సానా’ సినిమాలో బాల నటుడిగా జగదీప్‌కు తొలి అవకాశం లభించింది. ఆ సినిమాకి ఆయనకు అందిన పారితోషికం అక్షరాలా 6 రూపాయలు మాత్రమే. అయితే ఆ చిన్న ప్రారంభమే ఆయనకు పెద్ద అవకాశాలకు మార్గం సుగమం చేసింది. ‘దో బీఘా జమీన్’, ‘హమ్ పంఛీ ఏక్ డాల్ కే’ వంటి సినిమాలు ఆయన నటుడిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించాయి.
ప్రధానమంత్రి బాహుమతి
‘హమ్ పంఛీ ఏక్ డాల్ కే’ సినిమాలో అద్భుతంగా నటించినందుకు అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రత్యేకంగా ఓ పెన్ను బహుమతిగా అందించారు. ఇది జగదీప్ ప్రతిభకు లభించిన పెద్ద గుర్తింపు. దాదాపు 70 ఏళ్లపాటు సినీ పరిశ్రమలో నిరంతరంగా పనిచేసి అరుదైన రికార్డు సాధించిన జగదీప్.. 400కు పైగా సినిమాల్లో నటించారు. ఒక్క సినిమాకు దర్శకత్వం కూడా వహించారు.
3 పెళ్లిళ్లు.. ఆరుగురు పిల్లలు
జగదీప్ వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య నసీం బేగం, వీరికి హుస్సేన్ జాఫ్రీ, షకీరా షఫీ, సురైయా జాఫ్రీ అనే ముగ్గురు సంతానం. రెండో భార్య సుఘ్రా బేగంతో జావేద్ జాఫ్రీ, నావేద్ జాఫ్రీ అనే ఇద్దరు కుమారులు పుట్టారు. ఈ ఇద్దరూ ‘బూగీ వూగీ’ డ్యాన్స్ షో ద్వారా విస్తృత గుర్తింపు సంపాదించారు. మూడో భార్య నజీమాతో ముస్కాన్ అనే ఒక్క సంతానం ఉంది. 2020 జూలై 8న, 81 ఏళ్ల వయస్సులో ముంబైలో అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయన మొత్తం ఆస్తి 100 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.

