సౌత్, హిందీ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది సమీరా రెడ్డి. అందం, అభినయంతో సినీ అభిమానులని అలరించింది. 2014లో వివాహం తర్వాత సమీరా రెడ్డి వెండి తెరకు దూరంగా ఉంటోంది. భార్యగా, తల్లిగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే సమీరా రెడ్డి రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇంటికే పరిమితమైనప్పటికీ సమీరా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులతో చేరువగా ఉంటోంది. 

ఇటీవల ఎక్కువగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఓ చాట్ షోలో భాగంగా నటిగా తాను ఎలా ఎదిగాననే విషయాన్ని సమీరా వివరించింది. కెరీర్ ఆరంభంలో ఎవరి ముందైనా మాట్లాడాలంటే భయపడేదాన్ని. తరచుగా తడబాటుకు గురవడం నా బలహీనత. పలు సందర్భాల్లో ఆడిషన్స్ లో కూడా ఈ సమస్యని ఎదుర్కొన్నా. 

నా సమస్యని స్టార్ హీరో హృతిక్ రోషన్ గుర్తించాడు. ఆ సమస్యని అధికమించేందుకు ఓ పుస్తకం ఇచ్చాడు. తాను కూడా కెరీర్ లో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడట. ఆ పుస్తకం వల్ల నా కెరీర్ మలుపు తిరిగింది. జీవితమే మారిపోయింది అని సమీరా రెడ్డి వెల్లడించింది. ఆ పుస్తకాన్ని ఇప్పటికి నా వద్దే ఉంచుకున్నా. హృతిక్ రోషన్ కు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు అని సమీరా రెడ్డి తెలిపింది. 

తెలుగులో సమీరా రెడ్డి ఎన్టీఆర్ సరసన నరసింహుడు, అశోక్ లాంటి చిత్రాల్లో నటించింది. చిరంజీవి సరసన జై చిరంజీవ చిత్రంలో మెరిసింది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన అనంతరం సమీరా 2014లో అక్షయ్ వర్ధ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది.