టాలీవుడ్ ముద్దుగుమ్మ అక్కినేని సమంత పెళ్లి తరువాత సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కమర్షియల్ సినిమాలకు పక్కన పెట్టి కథా బలమున్న లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుంటోంది. నటిగా తన స్థాయిని మరింత పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

కలెక్షన్ల సంగతి పక్కన పెడితే ప్రశంసలకు మాత్రం లోటు లేదు. తాజాగా ఆమె నటించిన 'ఓ బేబీ' సినిమాకి కూడా హిట్ టాక్ రావడంతో ఇకపై తనే ప్రధాన పాత్రల్లో నటించే సినిమాలను ఎంపిక చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

ఈ క్రమంలో నయనతార చేయాల్సిన ఓ సినిమా వైపు సమంత మొగ్గు చూపుతోందట. గతంలో తమిళంలో వచ్చిన 'అరమ్' సినిమా సీక్వెల్ లో సమంతనటించబోతుందని సమాచారం. ఈ సినిమా తెలుగులో 'కర్తవ్యం' పేరుతో రిలీజైంది. ఆ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు. 

మొదట నయనతారే అందులో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సమంతకు ఆ ఛాన్స్ దక్కబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార ఓ పక్క కమర్షియల్ సినిమాలతో పాటు మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ఈ నేపధ్యంలో సమంత నుండి ఆమె గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.