టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన సినిమాల ఎంపిక విషయంలో పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా కనిపించిన ఈ భామ ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ కథలు, సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంపిక చేసుకుంటుంది.

ఇటీవల 'ఓ బేబీ' సినిమాతో సక్సెస్ అందుకున్న సమంత ప్రస్తుతం శర్వానంద్ తో తో కలిసి '96' రీమేక్ లో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్ మీడియా అమెజాన్ సంస్థ ఓ వెబ్ సిరీస్ ని రూపొందిస్తోంది. ఇందులో లీడ్ పాత్ర కోసం సమంతని సంప్రదించగా.. దానికి ఆమె అంగీకరించింది.

హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సిరీస్ షూటింగ్ చెన్నైలో  జరుగుతోంది. దీనికోసం ఏకంగా 40 రోజులు కాల్ షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ గా దీన్ని రూపొందిస్తున్నారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిందంటే అందులో కచ్చితంగా మంచి కంటెంట్ ఉండి ఉంటుందని భావిస్తున్నారు.

సామ్ వెబ్ సిరీస్ షూటింగ్ తో బిజీగా ఉండడంతో '96' సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. నిజానికి శర్వానంద్ గాయపడడంతో.. సినిమా మొదలుకాదనే ఉద్దేశంతో సమంత వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ శర్వా త్వరగా కోలుకున్నాడు. సమంత డేట్ లు అందుబాటులో లేకపోవడంతో తను ఓకే చెప్పిన మరో సినిమా 'శ్రీకారం' షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతల ప్లాన్.