ఎప్పుడూ రెండు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే సమంత ఇటీవల ఖాళీగా ఉంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో `జాను` సినిమాలో మెరిసిందామె. శర్వానంద్‌తో కలిసి నటించింది. ఈ సినిమా పరాజయం చెందింది. అప్పటి నుంచి కొత్తగా మరే సినిమాకి కమిట్‌ కాలేదు. `ది ఫ్యామిలీ మేన్‌` అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. 

ఇదిలా ఉంటే తాజాగా ఓ టాక్‌ షోకి హోస్ట్ గా సమంత వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది. `ఆహా` ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానున్న టాక్‌ షోకి సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించనుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరి కాసేపట్లో రానుంది. అల్లు అరవింద్‌, సమంత కలిసి మీడియాకి ఆ వివరాలు వెల్లడించబోతున్నారు. 

ఇదిలా ఉంటే సమంత ఫస్ట్‌ టైమ్‌ `బిగ్‌బాస్‌4`కి దసరా స్పెషల్‌ మహా ఎపిసోడ్‌కి హోస్ట్ గా వ్యవహరించారు. దీనికి మంచి రేటింగ్‌ వచ్చింది. హోస్ట్ గా సమంత యాప్ట్ అనే అర్థమైంది. టీవీ ఆడియెన్స్ కి కూడా సమంత ప్రజెన్స్ బాగా ఆకట్టుకుందట. దీంతో తాజాగా `ఆహా`లో టాక్‌షోకి ప్లాన్‌ చేశారట నిర్మాత అల్లు అరవింద్‌. ఓ కానెప్ట్ బేస్డ్ గా సెలబ్రిటీలను ముచ్చటించనున్నారు. మరి సినిమాలు ఒప్పుకోకుండా వెబ్‌ సిరీస్‌, టాక్‌ షోలు చేయడంతో ఇక సమంత సినిమాలు మానేసినట్టేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. మరి దీనిపై సమంత ఏం చెబుతుందో మరికాసెపట్లో తేలనుంది.