సమంతకి ఎంత కష్టమొచ్చిందో. గతంలో రాజమహేంద్రవరంలో మండుతున్న ఎండల్లో ‘రంగస్థలం’ చిత్రీకరణలో పాల్గొన్న సమంత ఇప్పుడు మరో సినిమా కోసం రాత్రిళ్లు వర్షంలో చిత్రీకరణలో పాల్గొనాల్సి వస్తోందట. ప్రస్తుతం సమంత ‘సూపర్‌ డీలక్స్’ అనే తమిళ చిత్రంలో విజయ్‌కి జోడీగా నటిస్తున్నారు.

 

ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలోని టెన్సకి ప్రాంతంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో వర్షంలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్స్‌లోని ఓ ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఫొటో మీద..‘రాజమహేంద్రవరంలో మండుటెండలో చిత్రీకరణలో పాల్గొని..ఇప్పుడు టెన్సకిలో రాత్రిళ్లు వర్షంలో జరుగుతున్న చిత్రీకరణలో పాల్గొంటున్నాను. దేవుడా..నాతో ఎందుకు ఇలాంటి డర్టీ ఆటలు ఆడుతున్నావ్‌?’ అంటూ ఏడుస్తున్న ఇమోజీలను జత చేశారు.

 

2018లో సమంత వరుస సినిమాలతో సందడి చేయబోతున్నారు. ఆమె నటించిన ‘రంగస్థలం’ చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. సుకుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించారు. మార్చిలో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోపక్క సమంత నటించిన ‘అభిమన్యుడు’ చిత్రం కూడా మార్చిలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు సమంత ‘మహానటి’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కన్నడలో మంచి విజయం అందుకున్న ‘యూటర్న్‌’ సినిమా రీమేక్‌తోనూ సామ్‌ బిజీగా ఉన్నారు.