హిట్టైన సినిమాలను వేరే భాషలోకి రీమేక్ చేస్తూండటం సినిమా పుట్టన నాటి నుంచి జరుగుతున్న ప్రక్రియ. అయితే మనకు తమిళం, హిందీ, మళయాళ పరిశ్రమల నుంచి కథలు తెచ్చుకుని రీమేక్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే తెలుగు పరిశ్రమ తన రూపు మార్చుకుంది. విభిన్నమైన కథాంశాలతో ముందుకు వెళ్తూండటంతో ఇతర భాషల వాళ్లు మన సినిమాలు రీమేక్ చేసుకునే పరిస్దితి వచ్చింది. రీసెంట్ గా అర్జున్ రెడ్డి చిత్రాన్ని రీమేక్ చేసి కబీర్ సింగ్ గా హిందీలో ఘన విజయం సాధించటంతో ఇక్కడ సినిమాలపై బాలీవుడ్ దృష్టి మరింతగా పెట్టింది. ఇప్పుడు వారి దృష్టిలో సమంత తాజా చిత్రం ఓ బేబి పడింది. 

వివాహానంతరం విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న సమంత, తాజాగా చేసిన మరో హీరోయిన్ ఓరియెంటెండ్ చిత్రం ఓ బేబీ. డబ్బై ఏళ్ల వృద్ధురాలైన ఓ మహిళకు తిరిగి యవ్వనం వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న పాయింట్‌ను ఎంటర్‌టైనింగ్‌ చెప్పే ప్రయత్నం చేసి విజయం సాధించారు దర్శకురాలు నందిని రెడ్డి. కొరియన్‌ మూవీ మిస్‌గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.బేబీ పాత్రలో సమంత మెప్పించిందంటూ అంతటా ప్రశంసలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యుఎస్ లో ఈ  సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. 

ఈ నేపధ్యంలో  ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు దగ్గుపాటి రానా చర్చలు జరుపుతున్నట్లు చెప్తున్నారు. రానా కు మంచి పరిచయాలు బాలీవుడ్ లో ఉన్నాయి. దాంతో అక్కడ ఓ పెద్ద సంస్దతో టై అప్ అయ్యి రీమేక్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు.  

హిందీ రీమేక్ తప్పకుండా ఉంటుందని.. తామే ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి తీసుకెళ్తామని చెప్పాడు రానా.  కంగనా రనౌత్, ఆలియా భట్ లాంటి హీరోయిన్స్ లో ఒకరితో  ‘ఓ బేబీ’ హిందీ రీమేక్  చేయబోతున్నారు.  అలాగే రానా కూడా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించే అవకాసం ఉందని చెప్తున్నారు.  అయితే సినిమా చివర్లో కనిపించే గెస్ట్ రోల్ లోనా లేక నాగశౌర్య పాత్రలోనా అనేది తెలియాల్సి ఉంది. 

ఓ బేబిలో సమంత.. స్వాతి అనే సింగర్ క్యారెక్టర్‌లో కనిపించగా, నాగశౌర్య ఇంపార్టెంట్ రోల్ చేసాడు.. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి డైలాగ్స్ : లక్ష్మీ భూపాల, కెమెరా : రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్ : జునైద్ సిద్దిఖీ, సంగీతం : మిక్కీ జె.మేయర్, కో-ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభోట్ల, యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు, నిర్మాణం : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ క్రాస్ పిక్చర్స్ .