ఇప్పటికే కృష్ణజింక వేటాడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. జర్నలిస్ట్ ని బెదిరించిన కేసులో కోర్ట్ సమన్లు అందుకున్నారు.

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసు చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా మరో వివాదం ఆయన్ని వెంటాడుతుంది. జర్నలిస్ట్ ని బెదిరించిన కేసులో ఆయనకు కోర్ట్ సమన్లు జారీ చేసింది. ఆయనతోపాటు ఆయన బాడీ గార్డ్ పై కూడా కేసు నమోదైంది. మరి ఇంతకి ఏం జరిగింది? ఎలా సల్మాన్‌ ఈ కేసులో ఇరుక్కున్నాడనేది చూస్తే. 

Salman Khan ఓ జర్నలిస్ట్ పై దాడి వివాదంలో ఇరుక్కున్నాడు. ఇది 2019లో సంచలనం సృష్టించింది. సల్మాన్‌ ముంబయి రోడ్డలపై సైక్లింగ్‌ చేస్తుండగా, తన ఫోన్‌ లాక్కున్నారని జర్నలిస్ట్ అశోక్‌ పాండే ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియా ఆయన్ని ఫోటోలు తీస్తున్నారని, ఈ క్రమంలోనే సల్మాన్‌ ఖాన్‌, ఆయన బాడీ గార్డ్ తన దగ్గరికి వచ్చి ఫోన్‌ లాక్కొని బెదిరించినట్టు అశోక్‌ పాండే తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కేసులో సల్మాన్‌పై, ఆయన బాడీగార్డ్ నవాజ్‌ షేక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అశోక్‌ పాండే కోర్ట్ ని ఆశ్రయించారు. 

జర్నలిస్ట్ ఫిర్యాదులో తాజాగా అంథేరి కోర్ట్ సల్మాన్‌కి, ఆయన బాడీగార్డ్ కి సమన్లు పంపించింది. ఈ ఘటనపై విచారణ జరిపించాలని లోకల్‌ పోలీసులను కోర్ట్ ఆదేశించింది. అయితే దీనిపై పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ సల్మాన్‌, ఆయన బాడీగార్డ్ కి ప్రతికూలంగా ఉంది. ఈ నేపథ్యంలో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆర్‌ఆర్‌ ఖాన్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం సల్మాన్‌, ఆయన బాడీ గార్డ్ పై ఐపీసీ సెక్షన్‌ 504, 506కింద కేసు నమోదైనట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంధేరీ కోర్టు వారికి నోటిసులు జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్‌ 5కి వాయిదా వేసింది. 

ఇక సల్మాన్‌ ఖాన్‌ తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల `అంతిమ్‌` చిత్రంతో అదరగొట్టిన సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం `కభీ ఈడ్‌ కభీ దివాలీ`, `టైగర్‌ 3` చిత్రాల్లో నటిస్తున్నారు. షారూఖ్‌ ఖాన్‌ `పఠాన్‌`లో గెస్ట్ రోల్‌చేస్తున్నారు. మరోవైపు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు సల్మాన్‌. చిరంజీవి నటిస్తున్న `గాడ్‌ ఫాదర్‌` సినిమాలో గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. ముంబయిలో చిత్రీకరణ జరుపుకుంటుండగా, సల్మాన్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. చిరు, సల్మాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.