బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం భారత్ బుధవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సల్మాన్ ఖాన్ వివిధ గెటప్పులలో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షుకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వసూళ్ల పరంగా భారత్ చిత్రం రికార్డులు కొల్లగొడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. 

90వ దశకంలో క్రీడా రంగంలో సచిన్ టెండూల్కర్, సినిమా రంగంలో ఖాన్ త్రయం సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్ లు సూపర్ స్టార్స్ గా ఎదిగారు. అమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కెరీర్ అంతకు ముందే ప్రారంభం అయింది. షారుఖ్ ఖాన్, సచిన్ లు మాత్రం 90వ దశకంలో వారి వారి రంగాల్లో అద్భుత ప్రదర్శన చేశారు. దీని గురించి సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 90వ దశకంలో ఇండియాలో సచిన్, షారుఖ్ ఖాన్ సూపర్ హీరోలుగా ఎదిగారని సల్మాన్ ఖాన్ తెలిపాడు. 

వీరిద్దరి గురించి అందరికి తెలుసు. కానీ అసలైన హీరో మరొకరు ఉన్నారని సల్మాన్ ఖాన్ తెలిపారు. నా దృష్టిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రియల్ హీరో. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా విశేషమైన సేవలు అందించారు. 1991, 92 సంవత్సరాలలో మన్మోహన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇండియా ఆర్థిక వ్యవస్థనే మార్చేసిందని సల్మాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. 

ఆ సమయంలో ఇండియా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అలాంటి తరుణంలో మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలు భారత ఆర్థిక పురోగతికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం ఇండియా బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందంటే అందుకు కారణం మన్మోహన్ సింగ్ అని సల్మాన్ ఖాన్ తెలిపాడు. నా దృష్టిలో 90వ దశకంలో ఎదిగిన అసలైన సూపర్ హీరో మన్మోహన్ సింగ్ అని సల్మాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు.