లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఎంజీఎం హాస్పిటల్‌ వైద్యులు వెల్లడించారు. ఎక్మో ట్రీట్‌ మెంట్‌ ఇస్తున్నట్టు తెలిపారు. ఆయన వైద్యానికి స్పందించడం లేదని స్పష్టమవుతుంది. 

ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఆయన
కోలుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే కమల్‌ హాసన్‌ ఆసుపత్రికి చేరుకుని బాలుని పరామర్శించారు. మరోవైపు బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సైతం కోలుకోవాలని వేడుకుంటున్నారు.

`బలసుబ్రమణ్యం సర్‌..త్వరగా మీరు కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుడిని ప్రార్థిస్తున్నా. నా కోసం ఎన్నో పాటలు పాడి నన్ను ఎంతో స్పెషల్‌గా మార్చినందుకు ధన్యవాదాలు. మీ `దిల్‌ దివానా హీరో ప్రేమ్‌.. లవ్‌ యూ సర్‌` అని ట్వీట్‌ చేశారు. 

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం బాలు ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.తమన్‌ ఓ స్పెషల్‌ వీడియోని పంచుకున్నారు. `లాక్‌డౌన్‌కి ముందు మార్చి నెలలో నాకెంత్‌ ప్రియమైన మామాతో మేమంతా సరదాగా గడిపాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడంలేదు. మామా దయజేసి త్వరగా కోలుకోండి. ఆయన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించండి` అని ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. వీరితోపాటు హరీష్‌ శంకర్‌, రాధిక, ఖుష్బు, గీతా మాధురి, మంచు లక్ష్మీ, చిన్మయి, ప్రసన్న వంటి అనేక మంది తారలు బాలు కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్‌ చేస్తున్నారు.