తమ పార్టీ అధికారంలోకి వస్తే హౌస్ వైఫ్ లు అందరికీ జీతాలు ఏర్పాటు చేస్తామని కమల్ హాసన్ ప్రకటించారు. అలాగే తమిళనాడులో పేదరిక నిర్మూలనే మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంచీపురం చేరుకొన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే పేదరిక నిర్మూలనకు 7 అంశాల పథకాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. గవర్నెన్స్‌ అండ్‌ ఎకనమిక్‌ పేరుతో ఆయన వీటిని ప్రకటించారు. 

వాటిలో గృహిణులకు ఇళ్లలో సేవలు చేస్తున్నందుకు వేతనం, అన్ని గృహాలకు 100ఎంబీపీఎస్‌ హైసీ్పీడ్‌ ఇంటర్నెట్‌తో కంప్యూటర్‌ సౌకర్యం, గ్రీన్‌ప్లస్‌ విప్లవం తీసుకువచ్చి రైతులను పారిశ్రామిక వేత్తలుగా మార్చడం, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిని పైకి తీసుకువచ్చి వారి శ్రేయస్సుకు కృషి, గ్రీన్‌ఛానల్‌ ప్రభుత్వాన్ని అందించడం, అన్ని ప్రభుత్వ సేవలను స్మార్ట్‌ఫోన్‌తో ప్రజలకు చేరవేయడం, పట్టణాల మాదిరిగా పల్లెలను కూడా అభివృద్ధి పరచడం, అవినీతిని నిర్మూలించి రాష్ట్రాన్ని సంపన్నంగా మార్చడం తమ లక్ష్యాలుగా వివరించారు. 

అయితే గృహిణులకు ఇళ్లలో సేవలు చేస్తున్నందుకు వేతనం అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ విషయం తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. అల్రెడీ ఇళ్లల్లో ప్రస్తుతం గృహిణులదే పై చేయి అనే విషయం కమల్ గుర్తించలేదని అంటున్నారు. 

మరో ప్రక్క డీఎంకే, అణ్ణాడీఎంకేలతో తమకు పొత్తు ఉండబోదని తెలిపారు. రజనీకాంత్‌ ఇంకా పార్టీ ప్రారంభించలేదని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన తన పేరును ప్రస్తావిస్తే అప్పుడు పరిశీలిస్తానని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పొత్తులపై జనవరిలో నిర్ణయం తీసుకొంటామని అన్నారు.