`సలార్‌` నుంచి అప్‌డేట్‌ లేదని ప్రభాస్‌ ఫ్యాన్స్ నిరాశలో, అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో పూనకాలు తెప్పించే అప్‌డేట్‌ ఇచ్చారు నిర్మాత. సీక్వెల్‌, షూటింగ్‌ అప్‌డేట్‌, రిలీజ్‌లపై క్లారిటీ ఇచ్చారు.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం `సలార్‌`(Salaar). `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. భారీ స్కేల్‌ ఉన్న మూవీ కావడంతో అంతే స్థాయిలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. శృతి హాసన్‌ (Shruti Haasan) ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. 

ఈ చిత్రం ఔట్ అండ్‌ ఔట్‌ మాస్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతుందని తెలిపారు నిర్మాత విజయ్‌ కిరగందూర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, `సలార్‌` బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతుందని తాము నమ్ముతున్నట్టు తెలిపారు. అదే సమయంలో అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా ఆల్మోస్ట్ 85శాతం షూటింగ్‌ పూర్తయ్యిందట. జనవరి ఎండింగ్‌ వరకు మొత్తం షూట్‌ పూర్తవుతుందని చెప్పారు. మరో ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్‌కి టైమ్ పడుతుందని, ముందుగా ప్రకటించినట్టుగానే సెప్టెంబర్‌ 28కి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ చేస్తామన్నారు. 

అంతేకాదు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే మరో విషయాన్ని వెల్లడించారు. ఎప్పట్నుంచో ఉన్న డౌట్‌ని క్లీయర్‌ చేశారు. `సలార్‌`కి సీక్వెల్(Salaar Sequel) ఉంటుందని వెల్లడించారు. సీక్వెల్‌ విషయంలో తాము ఓపెన్‌గానే ఉన్నామని తెలిపారు. మల్టీఫుల్‌ సీక్వెల్స్ చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. అంతేకాదు `కేజీఎఫ్‌`, `కాంతార` చిత్రాలను కూడా ఓ ఫ్రాంఛైజీగా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో మూడు వేల కోట్లు పెట్టుబడులు సినిమా రంగంలో పెట్టబోతున్నామని, ఆ స్థాయి సినిమాలను సౌత్‌లో నిర్మించాలనుకుంటున్నామని తెలిపారు. 

మొత్తానికి `సలార్‌` అప్ డేట్‌ రావడంతోపాటు సీక్వెల్‌ ప్రకటనతో ప్రభాస్‌ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఇది ఓ రకంగా అభిమానులకు పూనకాలు తెప్పించే విషయమే. అసలే అప్‌డేట్లు లేక నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి ఇది పెద్ద బూస్టింగ్‌ విషయమనే చెప్పాలి. ఇక బాక్సాఫీసు వద్ద కుమ్మేద్దామంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మరోసారి ఇండియన్‌ బాక్సాఫీసు షేక్‌ అయిపోవాల్సిందే అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో సలార్‌ రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు.