Asianet News TeluguAsianet News Telugu

Saina Nehwal Siddharth controversy: దేశం కోసం ఏం చేశాడు.. సిద్ధార్థ్‌పై సైనా నెహ్వాల్ తండ్రి ఫైర్‌

 సైనా నెహ్వాల్‌పై హీరో సిద్దార్త్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించిన సైనా నెహ్వాల్‌ తండ్రి హర్వీర్‌ సింగ్‌.. దేశం కోసం సిద్ధార్థ్‌ ఏం చేశాడని ప్రశ్నించాడు. సైనాపై సిద్ధార్థ్‌ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. 

saina nehwal father fire on hero siddharth
Author
Hyderabad, First Published Jan 11, 2022, 7:56 PM IST

హీరో సిద్ధార్థ్‌పై బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తండ్రి హర్వీర్‌ సింగ్‌ ఫైర్‌ అయ్యారు. తన కుమార్తెపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించిన హర్వీర్‌ సింగ్‌.. దేశం కోసం సిద్ధార్థ్‌ ఏం చేశాడని ప్రశ్నించాడు. సైనాపై సిద్ధార్థ్‌ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. `నా కూతురుని ఉద్దేశించి సిద్ధార్థ్‌ వ్యాఖ్యలు నిజంగా బాధాకరం. అసలు ఆయన దేశం కోసం ఏం చేశాడు? నా కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచింది. దేశ ప్రతిష్టని ఇనుమడింపచేసింది. భారత సమాజం గొప్ప విలువలు కలిగి ఉంది. జర్నలిస్ట్ లు, క్రీడా ప్రముఖులు సైనాకి మద్దతుగా ఉన్నారు. తను ఎంత కష్డపడితే ఈ స్థాయికి చేరుకుందో వాళ్లకి బాగా తెలుసు కాబట్టే ఆమెని గుర్తిస్తారు` అని తెలిపారు హర్వీర్‌ సింగ్‌. 

ఇదిలా ఉంటే సిద్ధార్థ్‌పై  జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రేఖా శర్మ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్‌ వ్యాఖ్యలను ఖండించిన ఆమె సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్‌ రిజిజు సహా పలువురు ప్రముఖులు సైనాకు అండగా నిలబడ్డారు. ఒలింపియన్‌పైన ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం సరికాదని సిద్ధార్థ్‌ తీరుపై మండిపడుతున్నారు. 

కాగా సైనా నెహ్వాల్‌ పలు ప్రతిష్టాత్మక టోర్నీలతో పాటు 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సైనా కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. ఇండియాకి ఆమె చేసిన సేవలకుగానూ 2009లో కేంద్ర ప్రభుత్వం అర్జున పురస్కారంతో, అలాగే మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేర్‌ రత్న అవార్డుని అందజేసింది. అలాగే 2010లో పద్మ శ్రీ పురస్కారం, 2016లో పద్మ భూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. ఇదిలా ఉంటే సైనా నెహ్వాల్‌ ప్రస్తుతం బీజేపీలో సభ్యురాలిగా ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios