యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ అంతా ఆసక్తికి చూపుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ చిత్రాల మార్కెట్ కూడా పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రం తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే ప్రాజెక్ట్ కూడా భారీ బడ్జెట్ తో కూడుకున్నదే. 

ప్రభాస్ కొత్త చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల రాజమౌళి మినహా ప్రభాస్ పెద్దగా స్టార్ దర్శకులతో సినిమాలు చేయలేదు. బాహుబలికి ముందు విడుదలైన మిర్చి చిత్రానికి కూడా కొరటాల దర్శకుడు. కొరటాల ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కావచ్చు. కానీ మిర్చి చిత్రమే అతడికి దర్శకుడిగా డెబ్యూ మూవీ. సాహో చిత్రాన్ని యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. రాధాకృష్ణ కూడా పాపులర్ డైరెక్టర్ ఏమీ కాదు. 

రాధాకృష్ణ తర్వాత ప్రభాస్ సాయి మాధవ్ బుర్రా దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాయిమాధవ్ బుర్రా అద్భుతమైన డైలాగ్ రైటర్ గా గుర్తింపు పొందారు. కానీ ఇంత వరకు ఒక్క చిత్రానికి కూడా దర్శకత్వం వహించలేదు. గతంలో కొందరు హీరోలతో సినిమాలు చేసేందుకు సాయిమాధవ్ బుర్రా ప్రయత్నించారు. కానీ సినిమా దిశగా అడుగులు పడలేదు. 

సాయిమాధవ్ బుర్రా చెప్పిన ఓ పవర్ ఫుల్ కథకు ప్రభాస్ ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.