Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: శైలజా రెడ్డి అల్లుడు

గతేడాది 'రా రండోయ్ వేడుక చూద్దాం' చిత్రంతో సక్సెస్ అందుకున్న నాగ చైతన్య వెంటనే 'యుద్ధం శరణం' సినిమాతో చతికిల పడ్డాడు. ఈ ఏడాది విడుదలైన 'మహానటి' చిత్రంలో చైతు ఏఎన్నార్ పాత్రలో నటించి మెప్పించాడు

sailaja reddy alludu movie review
Author
Hyderabad, First Published Sep 13, 2018, 12:25 PM IST

నటీనటులు: నాగ చైతన్య, అను ఇమ్మానుయేల్, రమ్యకృష్ణ, మురళీశర్మ, వెన్నెల కిషోర్, నరేష్ తదితరులు 
సంగీతం: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ 
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు 
నిర్మాతలు: ఎస్ రాధాకృష్ణ, నాగ వంశీ, పిడివి ప్రసాద్ 
దర్శకత్వం: దాసరి మారుతి 

గతేడాది 'రా రండోయ్ వేడుక చూద్దాం' చిత్రంతో సక్సెస్ అందుకున్న నాగ చైతన్య వెంటనే 'యుద్ధం శరణం' సినిమాతో చతికిల పడ్డాడు. ఈ ఏడాది విడుదలైన 'మహానటి' చిత్రంలో చైతు ఏఎన్నార్ పాత్రలో నటించి మెప్పించాడు. తాజాగా 'శైలజారెడ్డి అల్లుడు' అంటూ వినాయకచవితి రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అయిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
రావు గారు(మురళీశర్మ) వ్యాపారవేత్త.. అతడికి ఈగో బాగా ఎక్కువ. ఆయన కొడుకు చైతన్య(నాగ చైతన్య)కి మాత్రం ఈగో ఉండదు. తన పాజిటివ్ థింకింగ్ తో అందరికీ దగ్గరవుతుంటాడు. ఒక రోజు అను(అను ఇమ్మానుయేల్) అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. తన తండ్రి కంటే అనుకి ఈగో ఇంకా ఎక్కువ ఉందని చైతుకి అర్ధమవుతుంది. ఆమెను ప్రేమలో పడేయడానికి చాలా ప్రయత్నాలే చేస్తాడు. ఫైనల్ గా ఆమె చైతు కోసం తన ఈగోని కొంతవరకు తగ్గించుకొని అతడిని ప్రేమిస్తుంది.

తన కొడుకు ప్రేమించిన అమ్మాయి ఈగో నచ్చి ఇంటి కోడలు చేసుకోవడానికి ఫిక్స్ అవుతాడు రావుగారు. పంతం మీద చైతు-అనులకి నిశ్చితార్ధం చేస్తాడు. అను.. శైలజా రెడ్డి(రమ్యకృష్ణ) కూతురనే విషయం తెలియని రావుగారు చేసిన పని కారణంగా చైతు.. అనుకి దూరంగా కావాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఇంతకీ ఈ శైలజా రెడ్డి ఎవరు..? ఆమెను ఒప్పించి చైతు తన ప్రేమను గెలిపించుకోగలిగాడా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
హీరో ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆమె ఇంట్లో సమస్యలన్నీ పరిష్కరించి చివరకి తన ప్రేమను దక్కించుకోవడం.. గత మూడు దశాబ్దాలుగా ఇదే కాన్సెప్ట్ తో సినిమాలు వస్తున్నాయి. దర్శకుడు మారుతి కూడా ఇదే లైన్ ని ఎంపిక చేసుకున్నాడు. కాకపోతే దానికి ఈగో అనే కాన్సెప్ట్ ని యాడ్ చేశాడు. సాధారణంగా మారుతి సినిమాల్లో కథ లేకపోయినా.. తన కామెడీ ట్రాక్, పంచ్ డైలాగులతో ఫుల్ టైమ్ పాస్ చేస్తాడు. అతడి ఫ్లాప్ సినిమాల్లో కూడా కామెడీ ట్రాక్ లు హిట్టు. కానీ ఈ సినిమాలో మాత్రం అది వర్కవుట్ కాలేదు. వెన్నెల కిషోర్, పృథ్వి వంటి కమెడియన్స్ తో కామెడీ పుట్టించాలని చాలానే ప్రయత్నించాడు. కానీ అది పూర్తి స్థాయిలో వర్కవుట్ కాలేదు. ఇక కథలో కంటెంట్ లేకపోవడంతో సినిమా మొదలైన కొద్దిసేపటికే ఆడియన్స్ కి విసుగొస్తుంది.

sailaja reddy alludu movie review

ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా హీరో తన చేష్టలతో హీరోయిన్ ని ప్రేమించుకునేలా చేయడంపైనే శ్రద్ధ పెట్టారు. ఇంటర్వెల్ సమయానికి 'శైలజా రెడ్డి' పాత్రను రంగంలోకి దింపి బలమైన సన్నివేశాలతో ఇంటర్వెల్ ఇచ్చారు. దీంతో సెకండ్ హాఫ్ లో కథ రసవత్తరంగా సాగుతుందేమోనని ఆశించే ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. రమ్యకృష్ణ పాత్ర కథలో ఎంటర్ అయినప్పటి నుండి ఆమె చుట్టూ ఉండే జనాలు చేసే హడావిడి, ఆడవాళ్ల శ్రేయస్సు కోసం ఆమె పడే తాపత్రయం వంటి సీన్స్ తో సినిమాను నడిపించాడు. కూతురికి మించిన పొగరు అత్తకి ఉందని తెలుసుకున్న హీరో ఆ ఈగోని కంట్రోల్ చేయడానికి పడే పాట్లు సినిమాపై ఆసక్తిని మరింత తగ్గించాయి. నిజానికి సెకండ్ హాఫ్ లో తెరపై హీరో కనిపిస్తున్నా.. ఆయన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదనిపిస్తుంది.

యాక్షన్ సీన్స్, రెండు మూడు భారీ డైలాగ్స్ చెప్పి రెగ్యులర్ సినిమాల్లో మాదిరి హీరో తన అత్తని మార్చేసి ఆమెతోనే నా అల్లుడు అనిపించుకుంటాడు. కథలో గానీ కథనంలో గానీ ఎక్కడా కొత్తదనం లేని ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించడంతో పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకే ఆడియన్స్ సీట్లలో నుండి లేచి వెళ్లిపోవడం బాధాకరం. చాలా రోజులుగా మంచి హిట్ కోసం చూస్తోన్న నాగచైతన్య తన పాత్ర కోసం పెద్దగా కష్టపడినట్లు లేడు. సింపుల్ గా తన నటనతో మెప్పించే ప్రయత్నం చేశాడు. అతడి కాస్ట్యూమ్స్ బాగున్నాయి. తెరపై అందంగా కనిపించాడు. నిజానికి హీరో పాత్రను డిజైన్ చేసిన తీరు పెద్దగా ఆకట్టుకోదు. దీంతో చైతు తెరపై ఏం చేస్తున్నా.. ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. అను ఇమ్మానుయేల్ కేవలం గ్లామర్ ఎక్స్ పోజ్ చేయడానికి మాత్రమే ఉందనిపిస్తుంది.

sailaja reddy alludu movie review

ఇన్ని సినిమాలు చేసినా.. ఇప్పటికీ కొన్ని ఎక్స్ ప్రెషన్స్ విషయంలో ఆమె తడబడుతూనే ఉంది. తెరపై వీరిద్దరి జంట చూడడానికి బాగుంది. రమ్యకృష్ణ కూతురిగా అను యాప్ట్ అనే చెప్పాలి. సినిమాలో కాస్తో కూస్తో ఎంటర్టైన్ చేసిన సీన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి రమ్యకృష్ణ-అనుల ట్రాకే. మాణిక్యం అంటూ తెరపై వీరిద్దరూ చేసే హడావిడి నవ్వులు పూయిస్తుంది. మురళీశర్మ ఈగో ఫాదర్ క్యారెక్టర్ లో బాగా నటించాడు. కానీ అతడి లుక్ చూడడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. మిగిలిన పాత్రధారులు తమ పరిధుల్లో బాగా నటించారు. టెక్నికల్ గా ఈ సినిమాను మంచి క్వాలిటీతో రూపొందించారు. కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. పాటలు ఇదివరకే విన్న ఫీలింగ్ కలిగించాయి. నేపధ్య సంగీతం మాత్రం మెప్పిస్తుంది.

సినిమాలో పాటలు ఎక్కువవ్వడం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సివుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అత్త, కూతురు, అల్లుడు కాన్సెప్ట్ తో టాలీవుడ్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరోసారి అదే సక్సెస్ ఫార్ములాను నమ్ముకున్న నాగచైతన్య మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. అయినప్పటికీ కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలని భావించే ఆడియన్స్ ఈ సినిమాను ఒకసారి చూసే ప్రయత్నం చేయొచ్చు. 

రేటింగ్: 2/5   

                    

 

Follow Us:
Download App:
  • android
  • ios