ఎన్టీఆర్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్. ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ నటించనున్నారనే వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రస్తుతం ప్రభాస్‌ రాముడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణుడిగా నటిస్తున్నారు. 

ఆ సినిమా ప్రకటించగానే తెలుగులోనూ చాలా మంది తమ సినిమాలో సైఫ్ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది.  ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కనున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ను తీసుకుంటే మాత్రం ఈ సినిమా నెక్ట్స్ లెవిల్ కు  వెళ్లడం ఖాయమని అందరూ అభిప్రాయ పడుతున్నారు. మరి సైఫ్ ఈ ప్రాజెక్టును ఓకే చేస్తారో లేదో చూడాలి.  

 ‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’, ‘చౌడప్ప నాయుడు’ వంటి పేర్లను చిత్ర టీమ్ పరిశీలిస్తున్నట్లు  వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఈ రెండింటిలో ఏ టైటిల్ ను ఫైనల్‌ చేస్తారా? లేదా మరో టైటిల్ ని పెడతారనేది తెలియాల్సి ఉంది. ఇందులో హీరోయిన్స్ గా రష్మిక, పూజా హెగ్డేల పేర్లు వినిపిస్తున్నాయి.

అలాగే బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్‌ - ఎన్టీఆర్‌ చిత్రంలోనే తెలుగు సినీరంగ ప్రవేశం చేస్తుందనే వార్తలు అప్పట్లో వైరలయ్యాయి. గతేడాదే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చినా కూడా కరోనా వల్ల ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. వచ్చే నెలలో ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. మే నుంచి ఎన్టీఆర్30 సెట్స్ మీదకు వెళ్లే ఛాన్సులున్నాయని తెలుస్తుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్‌, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రంలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.