2023 సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్న మధు మంతెన తదుపరి 'రామాయణం'లో వీరిద్దరూ కలిసి కనిపించనున్నారు. సీత పాత్రలో సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు పుకార్లు వచ్చాయి.  


నటిగా సాయిపల్లవి ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలోకి అయినా ఆమె పరకాయ ప్రవేశం చేయగలసామర్ధ్యం ఉంది. దానికి తోడు ఈమె మంచి డ్యాన్సర్‌ కావడం బాగా కలిసి వచ్చింది. ఈ క్రమంలో తనను తాను నటిగా నిరూపించుకోవడానికి ఎక్కువ సమయం అవసరం లేకపోయింది. చదువుకుంటున్న రోజుల్లోనే చిన్న వేషాలు వేసిన సాయి పల్లవి మలయాళ చిత్రం ప్రేమమ్‌తో హీరోయిన్ గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం భాషలో నటిస్తూ బాగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో బాగా పాపులర్‌ అయ్యారు. 

గ్లామర్‌కు దూరంగా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ సంపాదించుకున్నారు. ఇటీవల పలు అవకాశాలను దూరం చేసుకున్నారు. కారణం ఏమైనా ప్రస్తుతం ఈమె చేతిలో ఒక చిత్రం కూడా లేదు. త్వరలో కమలహాసన్‌ నిర్మించనున్న చిత్రంలో శివ కార్తికేయన్‌కు జంటగా నటించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే ఇప్పుడు నార్త్‌ ఆడియన్స్‌ని మెప్పించేందుకు సిద్దమైందట.

అందుతున్న సమాచారం మేరకు బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్‌ నటిస్తున్న ఓ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుందట. ఈ చిత్రంలో రణబీర్‌ రాముడిగా కనిపిస్తే.. సీత పాత్రలో సాయి పల్లవి అలరించబోతుందట. ఇక ఈ చిత్రంలో రావణాసూరుడి పాత్రని హృతిక్‌ రోషన్‌ పోషించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. మరి సీతగా సాయి పల్లవి బాలీవుడ్‌ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. కాగా సాయి పల్లవి గురించి తాజాగా ఈ వార్త సమాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ విషయంపై సాయి పల్లవినే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.