సాయి తేజ వరస పెట్టి ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొన్నాడు. రీసెంట్ గానే చిత్ర లహరితో కాస్తంత ఒడ్డున పడ్డాడు. దాంతో అతను ఈ సారి నుంచి ఒప్పుకునే ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా ఫార్ములా కథలకు చెక్ చెప్తాడని, మాస్ హీరోలా రెచ్చి పోడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

దాంతో సాయి కమిట్ అయ్యే ప్రతీ ప్రాజెక్టు చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం మారుతితో చేస్తున్న సినిమా ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని మళ్లీ సాయిని ఫామ్ లోకి తెస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో సాయి మరో కొత్త చిత్రం ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ చిత్రం కూడా అతని కెరీర్ కు ప్లస్ అవుతుందా...

అందుతున్న సమాచారం ప్రకారం సాయి తేజ ...దర్శకుడు దేవకట్టా కథకు ఓకే చెప్పాడని సమాచారం.వెన్నెల, ప్రస్థానం లాంటి విభిన్న తరహా సినిమాలతో ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ దేవకట్టా.. అ తర్వాత ఆయన చేసిన ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలు ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో గ్యాప్ వచ్చేసింది. 

ఈ గ్యాప్ లో తయారు చేసుకున్న ఓ స్టోరీలైన్ తో  దేవకట్టా రీసెంట్ గా సాయి తేజను కలిసారట. పూర్తిగా సీరియస్ గా సాగే సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ప్రస్దానంకు సీక్వెల్ గా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే యూత్ ని ఆకట్టుకునే పాత్రల్లోకి పరకాయప్రవేశం చేస్తున్న సాయి తేజ మళ్లీ యాక్షన్ తో కూడిన సీరియస్ సబ్జెక్ట్ ఒప్పుకోవటం, అదీ ఓ ఫెయిల్యూర్ డైరక్టర్ తో  అవసరమా అని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. 

అయితే దేవకట్టా మామూలు డైరక్టర్ కాదు. డెప్త్ తో కూడిన డైలాగులతో థియోటర్స్ దద్దరిల్లేలా చేయగలరు. షాట్ డివిజన్ కూడా బాగుంటుంది. సినిమా యావరేజ్ అనిపించుకున్నా హీరోకు మంచి పేరు వస్తుంది. దానికి తోడు దేవకట్టా ఎలాగైనా పెద్ద హిట్ కొట్టి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సాయి  భయపడాల్సిన పనిలేదు.