కథ:

తేజు(సాయిధరమ్ తేజ్)కి చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్‌గా ఉండడం అలవాటు. ఎవరికైనా మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని నమ్మే వ్యక్తి నందకిషోర్(నాజర్)ని గురువుగా భావిస్తుంటాడు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుంటాడు. పెరిగి పెద్దయిన తరువాత నందకిషోర్ కంపెనీలోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరతాడు. నందకిషోర్ కూతురు సంధ్య(లావణ్య త్రిపాఠి), తేజు ప్రేమించుకుంటారు. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితాల్లోకి మాఫియా డాన్ విక్కీభాయ్(రాహుల్ దేవ్) ప్రవేశిస్తాడు. నందకిషోర్ కంపెనీని తన పేరు మీద రాయించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు విక్కీభాయ్. ఈ క్రమంలో నందకిషోర్‌ను చంపేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసి కంపెనీని విక్కీభాయ్ సొంతం చేసుకుంటాడు. ఆ తరువాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి..? తన గురువును చంపిన విక్కీభాయ్ మీద తేజు ఎలా పగ తీర్చుకున్నాడు..? చివరకు కంపెనీ ఎవరికి దక్కుతుంది..? అనేదే సినిమా. 

విశ్లేషణ: 

ఇంటిలిజెంట్ సినిమాలో కొత్తగా ఏమీ లేదు. కష్టపడి వేరొకరు బిల్డ్ చేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీని దక్కించుకోవాలని చూసే మాఫియా డాన్, అతడిని అంతం చేసి కంపెనీని కాపాడడం కోసం ప్రయత్నించే హీరో.. ఇదే సినిమా. గతంలో సాయిధరమ్ ఫక్తు కమర్షియల్ చిత్రాల్లోనే నటించినప్పటికీ.. కొంత మేరకు మంచి కథలనే ఎంపిక చేసుకున్నాడు. కానీ ఇక్కడ దర్శకుడు వినాయక్ కావడంతో కనీసం కథ కూడా వినకుండా సినిమా చేశాడా..? అనే సందేహాలు కలుగుతాయి. కథ ఎలాగూ లేదు కాబట్టి స్క్రీన్ ప్లే అయినా బాగా నడిపారా అంటే అదీలేదు. ఈ విషయంలో వినాయక్ పూర్తిగా విఫలమయ్యారు. వినాయక్ గత సినిమాల్లో కనిపించే బలమైన సన్నివేశాలు, ఉత్కంఠ రేకెత్తించే అంశాలు ఇందులో లేవు. హీరో పరిచయం కానీ, ఇంటర్వల్ సీన్ కానీ ఏదీ ఆకట్టుకోదు. ఇక పతాక సన్నివేశాలకు వచ్చేసరికి రొటీన్ కమర్షియల్ సినిమా మాదిరి హీరో ఫ్యామిలీ, స్నేహితులు, ప్రేమించే అమ్మాయిని విలన్ కిడ్నాప్ చేయడం వారిని వెతుక్కుంటూ హీరో వచ్చి విలన్‌ను చంపి తన వారిని కాపాడుకోవడం.. ఇవే సన్నివేశాలను మరింత సాగదీసి చూపించి ప్రేక్షకులను బాగా విసిగించారు దర్శకుడు. కామెడీ, రొమాన్స్ ఏ ఒక్క అంశం ఆకట్టుకోదు. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ కేవలం పాటలకు పరిమితం చేశారు. కనీసం ఆ పాటలైనా బాగున్నాయా అంటే అదీ లేదు. మెగాస్టార్ సాంగ్ ‘చమక్ చమక్ చామ్’ పాటను రీమిక్స్ చేసి చాలా పెద్ద తప్పు చేశారనిపిస్తుంది. పాటలో నటీనటుల కాస్ట్యూమ్స్, డాన్స్ ఆ పాట స్థాయిని తగ్గించాయనిపిస్తుంది. ఇకనైనా సాయిధరమ్ తేజ్.. మెగాస్టార్ పాటలను రీమిక్స్ చేయకపోవడం గురించి మరోసారి ఆలోచించాలి. తేజు నటన పరంగా ఆకట్టుకున్నాడు. నటుడిగా తన స్కిల్స్‌ను బాగానే ప్రెజంట్ చేశాడు.

విలన్ పాత్రల్లో కనిపించిన దేవ్ గిల్, రాహుల్ దేవ్ బాగానే నటించారు. థమన్ అందించిన నేపథ్య సంగీతం ఒకరకంగా సినిమాకు కలిసొచ్చే అంశం. పాటల కంటే నేపథ్య సంగీతమే బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రస్తుతం స్టార్ హీరోలు రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా వినూత్నమైన కథలను ఎంచుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇటువంటి రొటీన్ ఫార్మాట్‌తో మూస ధోరణిలో సినిమా చేసి ఆడియన్స్‌ను విసిగించడం బాధాకరం. మాస్ ఆడియన్స్‌ను అలరించే అంశాలు కూడా ఈ సినిమాలో పెద్దగా లేవు. వరుస ఫ్లాపులతో డీలాపడ్డ సాయిధరమ్ తేజ్‌ను ఈ సినిమా కూడా నిరాశపరుస్తుందనటంలో సందేహం అక్కర్లేదు.

చివరగా : 

సాయి ధరమ్ తేజ్ మళ్లీ ఇలా చేశాడేంటా అనిపించింది.. ఫ్యాన్స్ కు నచ్చుతుందో..