యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ అభిమానులు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. విడుదల సమయం దగ్గరపడే కొద్దీ సినిమాపై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సాహో చిత్రాన్ని 1500 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక తమిళనాడులో 550 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. 

సాహో చిత్రం వసూళ్ల పరంగా సాధించబోయే రికార్డుల విషయంలో అనేక అంచనాలు ఉన్నాయి. ఓపెనింగ్స్ విషయంలో బాలీవుడ్ లో ఏ హీరోకి దక్కని ఘనత సాహో చిత్రం ద్వారా ప్రభాస్ సొంతం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాహో చిత్రం తొలి రోజు ఓపెనింగ్స్ సౌత్ ఇండియన్ భాషల్లో 70 కోట్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

ఇక హిందీలో ఈ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రాల ఓపెనింగ్స్ రికార్డులని తుడిచిపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అవెంజర్స్ చిత్రం 53 కోట్ల వసూళ్లు తొలిరోజు సాధించింది. ఇక థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రం 52 కోట్ల వరకు రాబట్టింది. ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన సాహోపై ఈ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. సాహూ సృష్టించబోయే ప్రభంజనం ఏస్థాయిలో ఉంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.