రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 'బాహుబలి' సినిమా తరువాత ఆయన నటిస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. ఆగస్ట్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం ఈ నెల 18న సాయంత్రం 5 గంటల నుండి హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రీరిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. అన్ని భాషల్లో ప్రమోషన్స్ కవర్ అయ్యే విధంగా భారీ ఈవెంట్ లను నిర్వహిస్తున్నారు.

ఒక్కోరోజు ఒక్కో నగరాన్ని చుట్టేయడానికి ప్రభాస్ కోసం ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేశారు. ఈ చార్టెడ్ ఫ్లైట్‌లో ప్రభాస్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం వివిధ నగరాలను చుట్టేయనున్నారు. విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో వీలైంత త్వరగా అన్ని నగరాలను కవర్ చేయడానికి ఈ చార్టెడ్ ఫ్లైట్ ను ఏర్పాటు చేసుకున్నారు. 

సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ, చుంకి పాండే, మందిరా బేడి వంటి తారలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.