ప్రభాస్, సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'సాహో' సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, ట్రైలర్ లు చూస్తే ఈ సినిమా మంచి యాక్షన్ ఫిల్మ్ అనిపించకమానదు. అయితే ప్రభాస్ మాత్రం ఇది యాక్షన్ ఫిల్మ్ కాదని అంటున్నాడు. సాహోని యాక్షన్ ఫిల్మ్ కంటే ఎమోషనల్ సినిమాగానే భావిస్తున్నాడు.

సాహోలో ఎమోషన్ అనేది చాలా ముఖ్యమని.. చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని.. శ్రద్ధాకపూర్ పాత్ర చుట్టూ కథ ట్రావెల్ అవుతుందని ప్రభాస్ చెప్పారు. యాక్షన్ అంటే ఫైట్స్ మాత్రమే కాదని.. ఉత్తేజాన్ని కలిగించేలా కారు రేసులు, బైక్ రేసులు ఉంటాయని చెప్పారు.

యాక్షన్ ని కొత్తగా స్టైలిష్ గా చూపించామని.. కానీ యాక్షన్ కంటే ఎమోషన్ ఎక్కువ కనిపిస్తుందని అన్నారు. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా..? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు. సీక్వెల్ ఆలోచన ఉందని.. కానీ అది 'సాహో' రిజల్ట్ పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

'సాహో'కి వచ్చే రెస్పాన్స్ బట్టి సీక్వెల్ ఆలోచిస్తామని.. అయితే అది ఇప్పట్లో ఉండకపోవచ్చని.. కొంత సమయం తీసుకుంటామని చెప్పారు. ఈ సినిమాలో మీది డ్యూయ‌ల్ రోలా? అని అడిగితే 'డ్యూయ‌ల్ రోల్ కాక‌పోవొచ్చు' అని విచిత్ర‌మైన స‌మాధానం ఇచ్చాడు.

ఇంత సింపుల్ గా ఎలా ఉంటారని ప్రశ్నించగా.. తనకంటే ఎక్కువ విజయాలు సాధించిన వాళ్లు ఎంతో వినయంగా ఉంటారని.. రాజమౌళి, చిరంజీవి, రజినీకాంత్ లు కూడా ఎంతో ఎదిగినా అలానే ఉన్నారు.. నేనెంత అంటూ బదులిచ్చాడు.