అక్కినేని యువ రత్న అఖిల్ మొదటి విజయం తెగ ఊరిస్తోంది. ప్రతిసారి హిట్టు మాత్రం పక్కా అన్నట్టుగా అంచనాలు పెంచుతున్నా కూడా సక్సెస్ అందుకోవడం లేదు. ప్రస్తుతం అతడి ఆశలన్నీ మిస్టర్ మజ్నుపైనే ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రోమోలు ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే.

అయితే ఆ సినిమా ప్రోమోలను చూస్తుంటే అది రీమేక్ కథ అన్నట్టుగా టాక్ వస్తోంది. అలాగే కాన్సెప్ట్ గురించి వస్తోన్న కథనాలను చూసి బాలీవుడ్ లో రన్ బీర్ నటించిన ఒక లవ్ స్టోరీ తరహాలో ఉండనుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ‘బచ్నా యే హసీనా’ అనే సినిమా ఆధారంగా తెలుగు నేటివిటీకి తగ్గటుగా సినిమా ఉండనుందని తెలుస్తోంది. 

కెరీర్ మొదటిలో రన్ బీర్ ప్లే బాయ్ పాత్రలో నటించిన ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు గాని మేకింగ్ పరంగా పాజిటివ్ కామెంట్స్ ను అందుకుంది. అమ్మాయిల చుట్టూ తిరిగే ఓ అబ్బాయికి ఒక అమ్మాయి వల్ల ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఆ షాకులకు హీరో ఏ విధంగా చేంజ్ అవుతాడు అనేది సినిమా కాన్సెప్ట్. 

అదే తరహాలో మిస్టర్ మజ్ను లో అఖిల్ కనిపిస్తాడని సమాచారం. ఇప్పటివరకు ప్రోమోలు ఆ కథనే గుర్తు చేస్తున్నాయి. మరి సినిమా ట్రైలర్ ను బట్టి కథపై ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.