అతిలోక సుందరి శ్రీదేవి మరణం యావత్ భారతాన్ని శోకంలో ముంచేసింది. అందం అభినయంతో సినీప్రేమికులని మెస్మరైజ్ చేసిన ప్రతిభ శ్రీదేవిది. నిన్నటివరకు నిత్య యవ్వనంతో కనిపించిన శ్రీదేవి అనూహ్యంగా మరణించడంతో ఆమెకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. ఐదు పదుల వయసులో కూడా చలాకీగా ఉన్న శ్రీదేవి ఇలా ఊహించని విధంగా మరణించడంతో అంతా షాక్ కి గురయ్యారు. నటీమణిగా శ్రీదేవి సాధించని ఘనత లేదు. ఆమె అందానికి అతిలోక సుందరి అని పేరుపెట్టేసారు. అభినయానికి అంతా మంత్రముగ్దులయ్యారు. తెలుగు, తమిళ హిందీ భాషల్లో శ్రీదేవి స్టార్‌గా కొనసాగింది. అలాంటి నటి అనూహ్యంగా మరణించడంతో సినీ ప్రపంచం షాక్ కి గురైంది. శ్రీదేవిని గమనించిన వారంతా చిన్ననాటినుంచి ఆమెకు ఇటివంటి ఆరోగ్య సమస్య లేదని, శ్రీదేవి ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు. కానీ ఆమె ఊహించని విధంగా మరణించడం శ్రీదేవి ఆరోగ్యంపై చర్చ జరిగేలా చేస్తోంది. 2010,11 సంవత్సర మధ్య కాలంలో శ్రీదేవి క్యాన్సర్ బారీన పడ్డారని పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. శ్రీదేవి సన్నిహితులు ఆ పుకార్లని కొట్టిపారేశారు. దీనితో అప్పట్లో శ్రీదేవి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.దుబాయ్ లోని తన మేనల్లుడి వివాహానికి హాజరైన శ్రీదేవి అక్కడ సంతోషంగా గడుపుతూ ఉన్నపళంగా గుండె పోటు రావడంతో కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.శ్రీదేవికి కొంతకాలంగా హైపర్ థైరాయిడిజం అనే వ్యాధితో భాదపడుతున్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. కానీ శ్రీదేవి కుటుంబ సభ్యులు దీనిగురించి ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించలేదు.శ్రీదేవి వివాహ జీవితంలోకి అడుగుపెట్టాక తన కుమార్తెలే జీవితంగా బ్రతికింది. తన కుమార్తెలు జాన్వీ, ఖుషిని హీరోయిన్లుగా చూడాలని ఆశ పడింది. జాన్వీ నటిస్తున్న తొలి చిత్రం చూడకుండానే శ్రీదేవి మరణించడం విషాదకరం.