సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమాతో వీకెండ్ ఫార్మింగ్ అనేది బాగా ఫేమస్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి వసూళ్లు కూడా బాగానే వచ్చాయని టాక్.

అయితే ఓవర్సీస్ లో మాత్రం సినిమాకు నష్టాలు తప్పడం లేదట. సాధారణంగా మహేష్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంటుంది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయి. అలాంటిది 'మహర్షి'కి హిట్ టాక్ వచ్చినా పెద్దగా వర్కవుట్ కాలేదు.

అమెరికాలో ఈ సినిమా ఇప్పటివరకు 1.83 మిలియన్ల డాలర్లను రాబట్టింది. ఎలా చూసిన రెండు మిలియన్లు కూడా క్రాస్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో భారీ రేటు పెట్టి హక్కులు దక్కించుకున్న బయ్యర్ కి ఇప్పుడు  నష్టాలు తప్పడం లేదు. అమెరికాలో ఉన్న మహేష్ అభిమానులను ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది.

శ్రీమంతుడు, 3 ఇడియట్స్ ఛాయలు కనిపించడంతో అక్కడి ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. దీంతో సినిమా అక్కడ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. దాదాపు రెండు కోట్ల వరకు నష్టాలు వచ్చాయని సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం నిర్మాత దిల్ రాజు ఇందులో సగం నష్టాలను భరించబోతున్నట్లు తెలుస్తోంది.