కరోనా విలయతాండవం చేస్తుంది. చిత్ర పరిశ్రమలన్నీ ఆగిపోయాయి. వైరస్‌ రోజు రోజుకి మరింతగా విస్తరిస్తుంది. వేలమంది మృత్యువాత పడుతున్నారు. రోజుకి దాదాపు నాలుగు లక్షల కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. పేరెంట్లకి సరైన ట్రీట్‌మెంట్‌ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌ సైతం ఆపదలో ఉన్న వారికి అవసరమైన సాయం అందించే ప్రయత్నం చేస్తుంది. ఇక మరోసారి ప్రజలకు తమ సందేశాన్ని అందించింది `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. ఐదు భాషల్లో ఐదుగురు తారలు కరోనా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. 

ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌, అలియా భట్‌, అజయ్‌ దేవగన్‌, రాజమౌళి ఒక్కొక్కరు ఒక్కో భాషలో తమ సందేశాన్ని అందించారు. లెట్స్ `స్టాండ్‌ టుగెదర్‌` అంటూ కరోనాని ఎదుర్కొనేందుకు కలిసి నిలబడదామని పిలుపునిచ్చారు. అలియాభట్‌ తెలుగులో చెప్పగా, రామ్‌చరణ్‌ తమిళంలో, ఎన్టీఆర్ కన్నడలో, రాజమౌళి మలయాళంలో, అజయ్‌ దేవగన్‌ హిందీలో కరోనా నియమాలు, జాగ్రత్తలు చెబుతూ, ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ప్రస్తుత క్లిష సమయాన్ని వివరిస్తూ జాగ్రత్తలు తెలిపారు. మాస్క్ కచ్చితంగా ధరించాలని, వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోని పంచుకున్నారు. 

ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేస్తూ, `ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్క్ ధరించండి. వ్యాక్సినేషన్‌ చేయించుకోండి. కరోనాని స్టాప్‌ చేసేందుకు కలిసి నిలబడదాం. కరోనా విస్తరించకుండా ఆపేద్దాం. దేశాన్ని కాపాడదాం` అని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌తోపాటు రామ్‌చరణ్‌, రాజమౌళి కూడా ట్వీట్ల ద్వారా ఈ వీడియోని పంచుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, అలియా భట్‌ హీరోయిన్‌, అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13న విడుదల చేయాలని భావిస్తున్నారు.