రాజమౌళికి మరోపేరు జక్కన్న.. పర్‌ఫెక్షన్‌ కోసం ఆర్టిస్టు, టెక్నీషియన్లని సావగొడుతుంటాడని ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపించిన సందర్భాలు కోకొల్లలు. అవన్నీ గాలి వార్తలుగా విన్నాం. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ వంటి స్టార్‌ హీరోలే అలాంటి కామెంట్లు చేస్తే, ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తే.. ఎలా ఉంటుంది. నిజంగానే షాకింగ్‌గా ఉంటుంది. 

అలాంటిది ఏకంగా రాజమౌళి బర్త్ డే రోజునే ఆయన పెట్టే ఇబ్బందులను వెల్లడించారు. `ఆర్‌ ఆర్‌ ఆర్‌` చిత్ర బృందం మొత్తం రాజమౌళిని ఓ ఆట ఆడుకున్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్ నుంచి, స్టార్‌ హీరోల వరకు రాజమౌళిపై ఎంతటి కసితో, కోపంతో ఉన్నారు బయటపెట్టారు. గిఫ్ట్ పేరుతో రాజమౌళి నిజస్వరూపాన్ని బయటపెట్టారు.

శనివారం రాజమౌళి పుట్టిన రోజు. ఈ సందర్భంగా `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌ నుంచి ఆయనకు ఓ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆరు నిమిషాల నిడివి గల ఓ వీడియోని పంచుకున్నారు. ఇందులో కో డైరెక్టర్‌ త్రికోటి సిట్టింగ్‌ల గురించి, అసిస్టెంట్‌ డైరెక్టర్ నాగార్జున, కిరణ్‌, రాహుల్‌, శ్రీరామ్‌ లొకేషన్లు, సీన్లలో పర్‌ఫెక్షన్‌, కెమెరామెన్‌ సెంథిల్‌ కెమెరా లుక్‌లు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాటల రికార్డింగ్‌కి సంబంధించి, నిర్మాత డివివి దానయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

ఇక ఎన్టీఆర్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఒక్క షాట్‌ని మూడు గంటలపాటు తీసినప్పుడు కలిగిన కోపాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇంటికెళ్ళి రిలాక్స్ అవుదామనుకున్న టైమ్‌లో కాంప్లికేటెడ్‌ షాట్స్ పెడదాడట. ఇక తీసీ.. తీసీ.. పర్‌ఫెక్షన్‌ కోసం మమ్మల్ని సావగొడుతున్నాడని వాపోయాడు. మరోవైపు రామ్‌చరణ్‌ సైతం యాక్షన్‌ సీన్‌ ట్విస్ట్ చెప్పి తమని చాలా ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. 

ఇందులో కొసమెరుపు ఏంటంటే సెట్‌లో జరిగే వాస్తవాలనే చెప్పినా, ఇదంతా సినిమా పర్‌ఫెక్షన్‌ కోసమే అని తెలపడం విశేషం.