ఆర్ ఆర్ ఆర్ పై అంచానాలు ఏ స్థాయిలో ఉన్నాయో...వివాదాలు కూడా అదే స్థాయిలో తెరపైకి వస్తున్నాయి. ఎన్టీఆర్ టీజర్ తో ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ ఇచ్చిన రాజమౌళి ఆయనను అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ హీరోయిజం ఎలివేట్ కాగా, రాతి కండలు, మాస్ లుక్ లో ఎన్టీఆర్ కట్టిపడేశారు. ఐతే ఈ టీజర్ లో ఎన్టీఆర్ ని చివర్లో ఓ ముస్లిమ్ గెటప్ లో చూపించడం జరిగింది. 

కొమరం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ ని ముస్లిమ్ గా చూపించాడన్ని కొందరు తప్పుబడుతున్నారు. కొమరం భీమ్ అభిమానులతో పాటు హిందు సంఘాలు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణా బీజేపీ నాయకులు రాజమౌళిని బహిరంగంగా హెచ్చరించడం జరిగింది. హిందువైన కొమరం భీమ్ ని ముస్లిమ్ గా ఎలా చూపిస్తావ్ అని వారు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 

నిజానికి ఇది శాంపిల్ మాత్రమే అనుకోవాలి. ఇంతకు మించిన వ్యతిరేకత, ఇబ్బందులు రాజమౌళి భవిష్యత్ లో ఎదుర్కొనే అవకాశం కలదు. చరిత్రక పాత్రలైన అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ లను స్ఫూర్తిగా తీసుకున్న రాజమౌళి ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్నారు. ఉద్యమ వీరులుగా ఉన్న ఇద్దరు యోధుల జీవితగాథను రాజమౌళి తనకు ఊహకు తగ్గట్టుగా మలచి తెరకెక్కించడం మరిన్ని వివాదాలు రాజేయడం ఖాయం. 

చిన్న టీజర్ తోనే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజమౌళి, ట్రైలర్స్ మరియు సినిమా విడుదల తరువాత మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. ముఖ్యంగా చారిత్రకవాదులు ఈ సినిమాను పూర్తిగా వ్యతిరేకించే అవకాశం కలదు. భవిష్యత్తులో రాజమౌళి మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉండగా వాటిని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి...