#RRR: ఆస్కార్ కి నామినేట్ అయిన `నాటు నాటు`.. అవార్డుకి ఒక్క అడుగు దూరంలో..
`ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ చిత్రం అకాడమీ అవార్డు కి నామినేట్ అయ్యింది. ఆస్కార్‌కి నామినేట్ అయిన తొలి సినిమాగా `ఆర్‌ఆర్‌ఆర్` రికార్డు క్రియేట్ చేసింది.

`ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ చిత్రం అకాడమీ అవార్డు కి నామినేట్ అయ్యింది. తాజాగా మంగళవారం ప్రకటించిన నామినేషన్లలో అకాడమీ బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా, `నాటు నాటు` పాటని చంద్రబోస్ రాశారు. కాళభైరవతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ డాన్సులు చేశారు. ఈ పాటతోపాటు ఇద్దరు స్టార్ల డాన్సు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌అయ్యింది. అంతర్జాతీయ ఆడియెన్స్ ని సైతం అలరిస్తుంది.
ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్ అయిన తొలి ఇండియన్ మూవీగా `ఆర్‌ఆర్‌ఆర్` రికార్డు సృష్టించింది. అయితే ఈ చిత్రం ఒరిజినల్ సాంగ్‌తోపాటు ఉత్తమ యాక్టర్(ఎన్టీఆర్), ఉత్తమ దర్శకత్వం(రాజమౌళి) వంటి విభాగంలోనూ ఆస్కార్ నామినేషన్‌కి పోటీ పడింది. ఎన్టీఆర్‌కి ఉత్తమ నటుడిగా విభాగంలో నామినేషన్ కచ్చితంగా దక్కుతుందని అంతా భావించారు. కానీ చివరకు నిరాశే ఎదురయ్యింది. మరోవైపు ఇండియా నుంచి ఈ సారి `కాంతార`(ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు) విభాగాల్లో ఆస్కార్‌కి షార్ట్ లిస్ట్ అయ్యింది. అలాగే `ది కాశ్మీర్ ఫైల్స్`, గుజరాతీ మూవీ `చెల్లో షో` సినిమాలు కూడా షార్ట్ లిస్ట్ కాగా, నామినేషన్స్ దక్కలేదు.
ఇదిలా ఉంటే ఇండియా నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి. ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగంలో `మదర్ ఇండియా` (హిందీ) సినిమా తొలిసారి 1957లో నామినేట్ అయ్యింది. కానీ అవార్డు దక్కలేదు. ఆ తర్వాత 1988లో `సలాబ్ బాంబే` అనే హిందీ ఫిల్మ్ నామినేట్ అయ్యింది. ఆ సమయంలోనే నిరాశే ఎదురయ్యింది. మళ్లీ 2001లో అమీర్ ఖాన్ నటించిన `లగాన్` ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్ కాగా, అవార్డు దక్కలేదు.
ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కడం ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదే తొలిసారి. ఈ పాటపై అంతా నమ్మకంతో ఉన్నారు. ఆస్కార్ కచ్చితంగా దక్కుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇప్పటికే దీనికి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. దీంతో ఆస్కార్‌పై ఆశలు రెట్టింపు అయ్యాయి. మరి ఇది రికార్డు సృష్టిస్తుందా? ఎప్పటిలాగే నిరాశ పరుస్తుందా? అనేది మార్చి 12న తేలనుంది. ఆ రోజు ఆస్కార్ 2023 అవార్డులను ప్రకటిస్తారు.