RRR మూవీపై తీవ్ర ప్రభావం నిజమే, కోర్టుకి వెళ్లడం లేదు.. డైరెక్ట్ గా సీఎం జగన్ తోనే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల చిత్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోందనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం నియంత్రణ విధించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల చిత్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోందనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం నియంత్రణ విధించిన సంగతి తెలిసిందే. దీనితో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ యాజమాన్యాలకు సినిమా టికెట్ ధరలు తలనొప్పి వ్యవహారంలా మారాయి. చాలా రోజులుగా టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు ఏపీ ప్రభుత్వంలో చర్చలు జరుపుతూనే ఉన్నారు. కానీ సమస్య పరిష్కారం కావడంలేదు.
Rajamouli, Ram Charan, NTR కాంబినేషన్ లో తెరకెక్కిన RRR చిత్రం దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కింది. ఇలాంటి చిత్రాన్ని తగ్గించిన టికెట్ ధరలతో విడుదల చేస్తే నష్టం తప్పదు. దీనితో ఆర్ఆర్ఆర్ యూనిట్ కోర్టుకు వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించింది.
తాము కోర్టుకు వెళుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. 'తగ్గించిన టికెట్ ధరలతో ఆర్ఆర్ఆర్ చిత్రంపై తీవ్ర ప్రభావం ఉంటుందనేది వాస్తవం. కానీ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కి కోర్టుకు వెళ్లే ఆలోచన లేదు. ముఖ్యమంత్రి జగన్ ని కలసి సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారానికి, మా పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నిస్తున్నాం' అంటూ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.
కరోనా మొదలైనప్పటి నుంచి చిత్ర పరిశ్రమకు చిక్కులు మొదలయ్యాయి. దీనితో పలు భారీ చిత్రాలు వచ్చాయి. సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితి మెరుగవుతూ వచ్చింది. కానీ ఇంతలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించడం, ఆన్లైన్ టికెటింగ్ విధానం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండడంతో చిత్ర పరిశ్రమకు సమస్యగా మారింది.
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం నుంచే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాలకు ఉపక్రమించింది. ఎన్ని చర్చలు జరిగినా పరిష్కారం దిశగా అడుగులు పడడం లేదు. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ 'రిపబ్లిక్' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ ముఖ్యమంత్రి జగన్, ఇతర మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై కోపంతోనే ఏపీ ప్రభుత్వం ఇలా చిత్ర పరిశ్రమని ఇబ్బందిపాలు చేస్తోంది అని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం అటు టాలీవుడ్ లో, ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.
Also Read: నా భర్తగా అతడా.. వద్దనే వద్దు అంటున్న నయనతార ?
ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. రాంచరణ్, ఎన్టీఆర్ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో నటించారు. రిలీజ్ డేట్ లోగా ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల సమస్యని పరిష్కరించకపోతే ఆర్ఆర్ఆర్ మూవీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.